సాగు విప్లవం మార్పు మొదలైంది..! | CM YS Jagan Comments On His One Year Rule | Sakshi
Sakshi News home page

సాగు విప్లవం మార్పు మొదలైంది..!

Published Sun, May 31 2020 3:39 AM | Last Updated on Sun, May 31 2020 4:13 AM

CM YS Jagan Comments On His One Year Rule - Sakshi

రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన అనంతరం కియోస్క్‌ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు, అధికారులు

సాక్షి, అమరావతి:  ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని ఏడాది పాలనలో నిరూపించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 62 శాతం మంది ప్రజలు ఆధారపడ్డ  వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మక మార్పులతోనే కాపాడుకోగలుగుతామని, రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) ఏర్పాటుతోనే ఆ మార్పు మొదలవుతోందని చెప్పారు. విత్తనాల సరఫరా మొదలు రైతులు పంటలు అమ్ముకునే వరకు ఆర్‌బీకేలు తోడుగా ఉంటాయన్నారు. సాగుకు ముందే పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి రైతులకు అది తప్పనిసరిగా దక్కేలా ఆర్‌బీకేలు పని చేస్తాయని, అవసరమైతే పంటలు కూడా కొనుగోలు చేస్తాయని వెల్లడించారు. ఈ ఏడాది తొలి సంతకంగా పేర్కొంటూ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ముఖ్యమంత్రి జగన్‌ శనివారం ప్రారంభించారు. క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 10,641 ఆర్‌బీకేలను సీఎం ప్రారంభించారు.

ఆర్‌బీకేలలో ఉండే కియోస్క్‌ను కూడా సీఎం ప్రారంభించగా  ఓ రైతు దీనిద్వారా తనకు కావాల్సిన విత్తనాలను  ఆర్డర్‌ చేశారు. అనంతరం 155251 ఇంటరాక్టివ్‌ కాల్‌ సెంటర్‌ నెంబరుతో ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ (గన్నవరం) ప్రారంభించిన సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో మాట్లాడారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండురంగాపురంలోని ఆర్‌బీకేల పనితీరును సీఎం జగన్‌ లైవ్‌ ద్వారా వీక్షించారు. మార్కెట్‌ ఇంటెలిజెన్స్, పంటల కొనుగోలుకు సంబంధించిన ‘సీఎం–యాప్‌’ను ప్రారంభించి ‘ఆల్‌ ది వెరీ బెస్ట్‌’ అని టైప్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికల్చరల్‌ అసిస్టెంట్లకు ఈ సందేశం ఒకేసారి చేరింది. అనంతరం లోగోను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్రతి రైతు భరోసా కేంద్రం వద్ద సామాజిక దూరాన్ని పాటిస్తూ 50 మంది చొప్పున రైతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 5 లక్షల మంది రైతులను ఉద్దేశించి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ఆ వివరాలు ఇవీ..  
క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

అంతా ఆర్బీకేలలోనే.. 
విత్తనాలు వేయడం మొదలు పంటల అమ్మకం వరకు రైతులకు అండగా నిలిచేందుకు ఆర్బీకేలను ఏర్పాటు చేస్తున్నాం. వీటిల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తారు. అన్ని అంశాలలో రైతులకు సలహాలు, సూచనలు ఇస్తారు. ఆర్‌బీకేలు విజ్ఞాన శిక్షణ కేంద్రాల్లా పని చేస్తాయి. సేంద్రీయ, ప్రకృతి సాగుపై అవగాహన కల్పిస్తాయి. సాగుకు ముందే పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి, రైతన్నలకు ఆ ధర దక్కేలా కృషి చేస్తాయి. ఆర్‌బీకేలలో కియోస్క్‌ కూడా ఉంటుంది. వాటి ద్వారా రైతులు  తమకు కావాల్సినవి కొనుక్కోవడంతోపాటు పంటలు కూడా అమ్ముకోవచ్చు. ఇక్కడ టీవీ, ఇంటర్నెట్‌ కూడా ఉంటాయి. భూసార పరీక్షలకు అవసరమైన పరికరాలు కూడా ఉంటాయి.  

13 జిల్లాల్లో ల్యాబ్‌లు.. 
13 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. వ్యవసాయం ఎక్కువగా ఉన్న 147 నియోజకవర్గాలలో కూడా ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతతో పాటు భూసార పరీక్షలు కూడా నిర్వహించే విధంగా ల్యాబ్‌లలో సదుపాయాలు ఉంటాయి.  

ఈ–పంట.. 
ఈ–పంట (క్రాపింగ్‌) నమోదు ద్వారా పంటలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ఇన్సూరెన్సు రిజిస్ట్రేషన్‌. బ్యాంక్‌ రుణాల ప్రాసెస్‌ సేవలు పొందవచ్చు. ఈ కార్యక్రమంలో మంత్రులు కె.కన్నబాబు, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్నితో పాటు, పలువురు అధికారులు, కలెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.      

సీఎం–యాప్‌లో సమస్త సమాచారం.. 
ఆర్‌బీకేల్లో ఉండే అగ్చికల్చరల్‌ అసిస్టెంట్లందరికీ ట్యాబ్‌లు అందజేస్తాం. వాటిలో సీఎం–యాప్‌ (కాంప్రహెన్సివ్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ప్రైసెస్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ యాప్‌) డౌన్‌లోడ్‌ చేసి ఉంటుంది. యాప్‌లో అగ్రికల్చరల్‌ అసిస్టెంట్లు రోజూ పంటల సమాచారం, మార్కెట్‌ ధరలు, గిట్టుబాటు ధరల కల్పన, అవసరమైతే మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ తదితరాలు అప్‌లోడ్‌ చేస్తారు. ఆ వెంటనే జిల్లా మార్కెటింగ్‌ అధికారులతో పాటు ఆర్‌బీకేల కోసం ప్రత్యేకంగా నియమించిన జాయింట్‌ కలెక్టర్లు స్పందించి రైతులకు ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకుంటారు. విత్తనాల సరఫరా మొదలు సాగు మెళకువలు, సలహాలు, సూచనలు అందించడం, పంటల అమ్మకం, గిట్టుబాటు ధరల కల్పన వరకు గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలు గణనీయమైన పాత్ర పోషిస్తాయి. 

నష్టాల నుంచి బయటపడి లాభం పొందా..
ముందుగా ఏడాది సుపరిపాలన పూర్తి చేసుకున్న మీకు శుభాకాంక్షలు. మేం ప్రధానంగా వరి, పసుపు, వేరుశనగ పండిస్తుంటాం. వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా లబ్ధి పొందాను. చెప్పిన దానికంటే అదనంగా ఐదేళ్ల పాటు ఇస్తామని ప్రకటించడంపై రైతులంతా ఆనందంగా ఉన్నారు. నవంబరులో అకాల వర్షంతో వరి నేలకొరిగింది. పసుపునకు మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.6,850 చొప్పున ప్రకటించడంతో రైతులే స్వయంగా దళారీ వ్యవస్ధ లేకుండా, తూకంలో మోసం లేకుండా అమ్ముకోగలిగారు. నష్టపోయే పరిస్థితి నుంచి బయటపడి ఎకరాకు రూ.70 – 80 వేలు లబ్ధి పొందా. మా మండలం పెన్నా రివర్‌ బెడ్‌ కాబట్టి ఒక బ్యారేజీ నిర్మించాలని కోరుతున్నా.    
– శంకర్‌రెడ్డి, రైతు, వైఎస్సార్‌ జిల్లా
దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ వెంటనే రైతు ప్రతిపాదనను నోట్‌ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.  

సీఎం జగన్‌ పథకాలు సంతోషాన్నిస్తున్నాయి
రైతు సంక్షేమం కోసం సీఎం వైఎస్‌ జగన్‌
ప్రవేశపెట్టిన పథకాలు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. రైతు దేశానికి వెన్నెముకలాంటివారు. ఈవిషయం తెలిసిన ఆయన రైతులకు ఎంత మంచి చేయాలో అంతా చేస్తున్నారు. విలేజ్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ప్రోగ్రామ్‌ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. మహాత్మాగాంధీ చెప్పినట్టు బుద్ధిబలం, కండబలం కలిసి పనిచేయాలి. ఈ నాలెడ్జ్‌ సెంటర్‌ద్వారా ఇది నెరవేరుతుందని ఆశిస్తున్నాను. ఇది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతులకు మంచి చేస్తున్న ఆయనకు మరోసారి ధన్యవాదాలు.   
– వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రొఫెసర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ సందేశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement