వాళ్ల కష్టాలు విన్నా.. చూశా: సీఎం జగన్‌ | CM Ys Jagan Comments At Inaugurates Of Raithu Barosa Centre | Sakshi
Sakshi News home page

రైతుల ఇబ్బందులను చూశా: సీఎం జగన్‌

Published Sat, May 30 2020 11:44 AM | Last Updated on Sat, Oct 3 2020 8:40 PM

CM Ys Jagan Comments At Inaugurates Of Raithu Barosa Centre - Sakshi

సాక్షి, తాడేపల్లి : రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ది అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్బంగా శనివారం రాష్ట్రంలో వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..తమ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రైతులతో గడపడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయని, రైతుభరోసా కేంద్రాలతో గ్రామాల్లో విప్లవాత్మక మార్పు రాబోతుందని వ్యాఖ్యానించారు.

‘మనది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పాం.. చేశాం’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం తమదని, రైతు భరోసా ద్వారా రూ.10,200 కోట్లు 49 లక్షల రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు వెల్లడించారు. రైతుకు అవసరమైన సమయంలో సహాయం అందాలని, విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతులకు అడుగడుగునా తోడుగా ఉంటామని భరోసానిచ్చారు. తొలి ఏడాది పాలన నిజాయితీతో, చిత్తుశుద్ధితో గడిచిందన్నారు. (ఏడాదిలో ఎన్నో సంచలన నిర్ణయాలు)

భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించా
‘నా 11 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో కోట్లమందిని కలిశా. 3,648 కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్ర చేశా. పాదయాత్రలో ప్రజల కష్టాలు విన్నా.. చూశా. చదివించే స్థోమత లేక పిల్లలను బడులకు పంపని పరిస్థితులను చూశా. రైతుల ఇబ్బందులను చూశా. కష్టాలు పడుతున్న అక్కాచెల్లెమ్మల పరిస్థితులు చూశా. గుడి దగ్గర, బడి దగ్గర విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను చూశా. వీటన్నింటికి పరిష్కారంగా మేనిఫెస్టోను తీసుకొచ్చాం. కుల, మత, పార్టీలకతీతంగా అర్హత ఉన్నవారందరికీ మంచి చేయాలని ఆలోచన చేశా.కేవలం రెండు పేజీల్లోనే మేనిఫెస్టో పెట్టాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించా. ఇప్పటికే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను నెరవేర్చాం.

వైఎస్‌ జగన్‌ అనే నేను.. ఏడాది కాలంగా.. మీ కుటుంబ సభ్యుడిగా.. నేను చేసిన ప్రమాణానికి అనుగుణంగా మీ కోసం పనిచేస్తున్నానని స్పష్టం చేస్తున్నా. సీఎం కార్యాలయం నుంచి ప్రతి అధికారి దగ్గరా మేనిఫెస్టోను ఉంచాం. మేం ఇచ్చిన 129 హామీల్లో.. ఇప్పటికే 77 అమలు చేశాం. అమలు కోసం మరో 36 హామీలు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 16 హామీలను కూడా త్వరలోనే పరుగులు పెట్టిస్తాం. మేనిఫెస్టోలో లేని మరో 40 హామీలను కూడా అమలు చేశాం’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన అందించిన సంక్షేమ పాలన గురించి వివరించారు.

ఆరోగ్యశ్రీని మరింత మెరుగుపరిచాం
రాష్ట్రంలోని 3 కోట్ల 58 లక్షల మందికి సంక్షేమ పథకాలు అందించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. అలాగే రూ. 40,627 కోట్లను ఎలాంటి అవినీతి లేకుండా ప్రజల అకౌంట్లలో జమ చేసినట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీని మరింత మెరుగుపరిచి.. ఆరోగ్య ఆసరా ద్వారా డబ్బులు ఇస్తున్నాం. కంటి వెలుగు ద్వారా అవ్వా, తాతాలకు, విద్యార్థులకు పరీక్షలు చేయిస్తున్నాం. వాహన మిత్ర, లా నేస్తం, నేతన్న నేస్తం వంటి పథకాలను ప్రారంభించాం. కోటి 78 లక్షల బీసీలకు రూ.19,309 కోట్లు ఖర్చు చేశాం. 18 లక్షల 40వేల మంది ఎస్టీలకు రూ.2,136 కోట్లు ఖర్చు చేశాం. 19 లక్షల 5వేల మైనార్టీలకు రూ.17,222 కోట్లు ఖర్చు చేశాం. ఎక్కడా అవినీతికి తావులేకుండా నేరుగా వారి అకౌంట్లలోనే జమ చేశాం.

గత ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టో పేరుతో బుక్‌లు రిలీజ్‌ చేసేవారు. గత ప్రభుత్వం 600లకుపైగా హామీలిచ్చి.. 10శాతం కూడా నెరవేర్చలేదు. జన్మభూమి కమిటీల నుంచి రాజధాని భూముల వరకు.. అన్నీ తమ కనుసన్నల్లోనే ఉండాలని గత ప్రభుత్వం కోరుకునేది .ప్రభుత్వ భూమిని పేదలకు ఇస్తుంటే.. కోర్టుకెళ్లి అడ్డుకునే ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నా. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వాస్పత్రులు.. చివరకు ప్రభుత్వ డెయిరీలను మూసివేసేందుకు గత ప్రభుత్వం కుట్రలు చేసింది. గత ప్రభుత్వంలో పేదలకు పథకాలు దక్కాలంటే జన్మభూమి మాఫియాకు లంచాలు ఇవ్వాల్సిందే. మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. మాన ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరీ ఇంటికే వెళ్లి పథకాలు అందిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement