మూడేళ్లలో కడప ఉక్కు | CM YS Jagan Mohan Reddy to inaugurate Kadapa Steel Plant | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో కడప ఉక్కు

Published Tue, Dec 24 2019 3:27 AM | Last Updated on Tue, Dec 24 2019 1:50 PM

CM YS Jagan Mohan Reddy to inaugurate Kadapa Steel Plant - Sakshi

వైఎస్సార్‌ జిల్లా సున్నపురాళ్ల పల్లెలో ఉక్కు పరిశ్రమకు జరిగిన శంకుస్థాపనలో శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్, చిత్రంలో మంత్రులు, అధికారులు, నేతలు

ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే నాలుగున్నరేళ్లు ఏమీ చేయకుండా, ఎన్నికలకు ఆరు నెలల ముందు ఒక పెద్ద మనిషి వచ్చి ఉక్కు పరిశ్రమ అంటూ టెంకాయ కొడితే దానిని మోసమంటారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే పరిశ్రమ నిర్మాణానికి టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు. ఇదే ఆయన పాలనకు, నా పాలనకు మధ్య తేడా.

వాస్తవానికి స్టీల్‌ ఫ్యాక్టరీ కట్టడం రాష్ట్ర ప్రభుత్వం పని కాదు. ఐదేళ్లు ఎదురు చూసినా కడపకు కేంద్రం స్టీల్‌ ఫ్యాక్టరీ ఇవ్వక పోవడంతో రాయలసీమ ముఖ చిత్రం మార్చాలని, పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని మనమే ముందడుగు వేయాల్సి వచ్చింది.

ఉక్కు సంకల్పంతో ఈ ఫ్యాక్టరీకి పునాది రాయి వేస్తున్నా. ఈ పరిశ్రమతో మన బతుకులు మారతాయి. వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. అనుబంధ యూనిట్లూ వస్తాయి. ఇప్పటికే అనంతపురంలో కార్ల పరిశ్రమ ఉంది. వీటన్నింటి ద్వారా ఉద్యోగాలలో కొత్త శకానికి నాంది పలుకుతున్నాం. దీంతో రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది.  – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి కడప : కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రూ.15 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమ ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద సోమవారం ఉదయం ఆయన కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసినంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఇది తన జీవితంలో మరిచిపోలేని ఘట్టమన్నారు. ఈ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
 
ఆ కల సాకారం చేసేందుకు శ్రీకారం
‘‘జిల్లాలో స్టీల్‌ ఫ్యాక్టరీ రావాలని, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పరుగులు పెట్టాలని ఎన్నో కలలు కన్నానని తెలిపారు. జిల్లా అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి, నాన్నగారి హయాంలో కాస్తో, కూస్తో ముందడుగులు పడ్డాయి. నాన్న చనిపోయాక జిల్లా గురించి, మన పిల్లల గురించి గానీ, వారికి మంచి జరగాలనిగానీ ఎవరు ఆలోచించలేదు. రాయలసీమ వెనుకబడిన ప్రాంతమని, నీరు, పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే విషయం తెలిసిన వ్యక్తి, మీ బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నాడు. ఇందులో భాగంగా రాయలసీమ ఆర్థిక, ఉద్యోగాల చరిత్రను మార్చేందుకు 30 లక్షల టన్నుల సామర్థ్యంతో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తున్నామని సగర్వంగా చెబుతున్నా.  
 
రాష్ట్రంతో పాటు దేశానికీ మేలు
ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ పరిశ్రమకు ముడిసరుకు అందించేందుకు ఎన్‌ఎండీసీ (నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)తో మన ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇందుకు ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు తప్పకుండా ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ కట్టిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు ఇది కూడా చేస్తామని చెప్పారు. ఐదేళ్లు ఎదురు చూసినా న్యాయం జరగలేదు.

దేవుడి దయ, అందరి చల్లని దీవెనలతో ఈ రోజు కడపతోపాటు రాయలసీమ జిల్లాలకు న్యాయం జరిగే రోజులు మళ్లీ వచ్చాయి. 2018 నాటికి దేశంలో ఉక్కు పరిశ్రమ సామర్థ్యం కోటి ఆరు లక్షల టన్నులు. జాతీయ విధానం ప్రకారం 2030 నాటికి మన దేశ అవసరాలు తీరాలంటే మూడు కోట్ల టన్నుల సామర్థ్యం అవసరమని అంచనా. ఈ పరిస్థితిలో ఈ జిల్లాలో 30 లక్షల టన్నుల సామర్థ్యంతో ఫ్యాక్టరీ రావడం వల్ల రాష్ట్రంతోపాటు దేశానికి మంచి జరుగుతుంది.  
 
పెద్ద సంస్థలతో చర్చలు
రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు ఈ ఫ్యాక్టరీని కడుతూనే.. మరోవైపు ఇదే విషయమై పెద్ద పెద్ద కంపెనీలతో చర్చలు జరుపుతుంది. ఆ చర్చలు చర్చలు కొలిక్కి వచ్చే వరకు ఆగకూడదన్న ఉద్దేశంతోనే మనమే ముందడుగు వేశాం. మధ్యలో ఎవరైనా వస్తే సరి. రాకపోతే ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమను నిర్మిస్తుంది. ఏపీ స్టీల్స్‌ అనేది మన రాష్ట్ర హక్కుగా నిలుస్తుంది. ఏపీలో ఉక్కు పరిశ్రమ కావాలని 1960లో ఉక్కు ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమంలో 1966లో ఆరుగురు విద్యార్థులు, ముగ్గురు ఉద్యోగులు.. మొత్తంగా తొమ్మిది మంది బలిదానం చేశారు. దీంతో నాడు ‘ఆంధ్రుల హక్కు – విశాఖ ఉక్కు’ అనే పిలుపుతో ఉద్యమం సాగింది. ఇవాళ మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు కాబట్టి ఉద్యమాలు, ప్రాణ త్యాగాల అవసరం లేకుండానే, ఆరు నెలలు తిరక్కుకుండానే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాం.దేవుడి ఆశీర్వాదంతో మీ బిడ్డ మరిన్ని గొప్ప కార్యక్రమాలు చేయగలిగేలా అందరూ ఆశీర్వదించాలి’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. అంతకు ముందు ఉదయం 11.48 గంటలకు ఉక్కు పరిశ్రమ శంకుస్థాపనకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం వేదికపై వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాష, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఆదిమూలపు సురేష్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎంపీలు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


 ఉక్కు కర్మాగారం శంకుస్థాపన సందర్భంగా జరిగిన బహిరంగ సభకు హాజరైన జనవాహినిలో ఒక భాగం. ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement