సాక్షి, అమరావతి: రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష కడప స్టీల్ ప్లాంట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడాదికి 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ (ఏపీహెచ్‌ఎస్‌ఎల్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కంపెనీని ఏర్పాటు చేసింది. వైఎస్సార్ జిల్లా సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,591.65 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌కు సీఎం వైఎస్ జగన్ గతేడాది డిసెంబర్ 23న శంకుస్థాపన చేసినప్పటి నుంచి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 67వ నంబర్ జాతీయ రహదారి నుంచి ప్లాంట్ దగ్గరకు చేరుకోవడానికి నాలుగులైన్ల రహదారి నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ సోమవారం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్లాంట్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.76 లక్షలు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే సాయిల్ టెస్టింగ్, సర్వే పనులు పూర్తి చేసి ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపట్టినట్లు ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.షాన్ మోహన్ ‘సాక్షి’కి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
► జనవరి నుంచి ప్రధానప్లాంటు పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్లాంట్‌కు చేరుకోవడానికి అవసరమైన నాలుగు లైన్ల రహదారికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.
► 10,000 కేవీఏ సామర్థ్యంతో విద్యుత్ సరఫరా కోసం ఏపీఎస్‌పీడీసీఎల్‌కు రూ.6.88 కోట్లు కేటాయించారు. సుమారు రూ.15,000 కోట్ల పెట్టుబడి అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సేకరించే బాధ్యతను ఎస్‌బీఐ క్యాప్‌కు అప్పగించారు.
► ప్లాంట్‌కు అవసరమైన నీటిని గండికోట రిజర్వాయర్ నుంచి సరఫరా చేయడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమవుతోంది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై ఇప్పటికే దరఖాస్తు చేశాం. రెండు కీలకమైన సమావేశాలు ఇప్పటికే పూర్తయ్యాయి.
► ఈ ప్లాంట్‌కు అవసరమైన ముడి ఇనుము ఏటా 5 మిలియన్ టన్నులు సరఫరా చేయడానికి ఇప్పటికే ఎన్‌ఎండీసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
► ప్లాంటు నుంచి వచ్చే వ్యర్థాలను సొంత అవసరాలకు వినియోగించుకునేలా 88.6 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
నెల రోజుల్లో భాగస్వామ్య కంపెనీ ఎంపిక
► ఈ ప్రాజెక్టులో భాగస్వామ్య కంపెనీగా చేరడానికి ఆసక్తి ఉన్నకంపెనీల నుంచి దరఖాస్తులు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) కోరుతూ టెండర్లు పిలిచారు.
► దీనికి జాతీయ అంతర్జాతీయ కంపెనీల నుంచి మంచి స్పందన వస్తోంది.
► ఇప్పటికే ఐదు కంపెనీలు ఆసక్తి కనబరిచాయి.
► ఈవోఐ దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 31 వరకు గడువుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
► మొత్తం ప్రక్రియను వచ్చే నెలరోజుల్లో పూర్తి చేసి భాగస్వామ్య కంపెనీని ఎంపిక చేయనున్నారు.
► శంకుస్థాపన చేసినప్పటి నుంచి మూడేళ్లలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment