స్టేజ్‌ 3 పేషెంట్లకు రూ.5 వేల పెన్షన్‌: సీఎం జగన్‌ | CM YS Jagan Speech About Welfare Schemes In Palasa Meeting Srikakulam | Sakshi
Sakshi News home page

కిడ్నీ బాధితులపై సీఎం జగన్‌ వరాలు

Published Fri, Sep 6 2019 12:47 PM | Last Updated on Fri, Sep 6 2019 2:50 PM

CM YS Jagan Speech About Welfare Schemes In Palasa Meeting Srikakulam - Sakshi

సాక్షి, పలాస/శ్రీకాకుళం : కిడ్నీ వ్యాధి బాధితులకు స్టేజ్‌ 3 నుంచే పెన్షన్‌ అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం స్టేజ్‌ 5లో డయాలసిస్‌ పేషెంట్లకు ఇస్తున్న రూ. 10 వేల పెన్షన్‌తో పాటు, స్టేజ్‌ 3లో ఉన్న వారికి కూడా రూ. 5 వేల పెన్షన్‌ అందజేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా డయాలసిస్‌ పేషెంట్లకు సహాయంగా ఉండేందుకు హెల్త్‌ వర్కర్లను నియమిస్తామని, బాధితులతో పాటు వారికి కూడా ఉచిత బస్సు పాసులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఉద్ధానం కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు పలాసలో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ, రీసెర్చ్‌ ఆసుపత్రికి సీఎం జగన్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం గడప గడపకూ నాణ్యమైన రేషన్ బియ్యం సరఫరాకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో చెప్పినట్లుగా కిడ్నీ బాధితుల కష్టాలు తీరుస్తానన్న మాటను ఈరోజు నిలబెట్టుకున్నానని పేర్కొన్నారు. ఇదంతా ప్రజల ఆశీర్వాదం వల్లే సాధ్యమైందని తమ పార్టీని 151 స్థానాల్లో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిగా వందరోజుల పాలన ముగించుకుని మేనిఫెస్టోలో పేర్కొన్న ఒక్కో హామీని నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. కిడ్నీ బాధితులకు 10 వేల పెన్షన్‌ ఇచ్చే ఫైలుపై తొలి సంతకం చేశానని గుర్తుచేశారు. కిడ్నీ బాధితుల కోసం నిర్మిస్తున్న ఆస్పత్రిలో ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. కిడ్నీ బాధితులకు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని... నాణ్యమైన మందులు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. సమస్యకు మూల కారణాన్ని అన్వేషించి వ్యాధులు రాకుండా ఉండేందుకు ఉద్ధానం ప్రాంతమంతా మంచినీటి తాగునీటి సరఫరాకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. పలాస, ఇచ్చాపురం మొత్తం అన్ని గ్రామాల్లో నేరుగా ఇంటి వద్దకే తాగునీటిని అందించే కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తున్నానని తెలిపారు.

తిత్లీ తుఫాను బాధితులకు చెక్కు పంపిణీ
పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చినట్లుగా తిత్లీ బాధితులకు పరిహారం పెంచుతున్నామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ. 1500 నుంచి 3 వేల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. అదే విధంగా జీడితోట హెక్టారుకు పరిహారాన్ని రూ. 30 వేల నుంచి రూ. 50 వేలకు పెంచుతున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం నుంచే చెక్కుల పంపిణీ మొదలవుతుందని వెల్లడించారు.

మత్స్యకార్మికుల కోసం ఫిషింగ్‌ జెట్టీ
‘ఆ రోజు పాదయాత్రలో మత్స్యకార సోదరులు ఫిషింగ్‌ జెట్టీ కావాలని అడిగారు. ఆ ఆలోచనను గత పాలకులు పట్టించుకోలేదు. వారి సమస్యలు విని నేనున్నానంటూ నాడు భరోసా ఇచ్చాను. ఈ రోజు మంచినీళ్లపేట, నువ్వులరేవులో ఫిషింగ్‌ జెట్టీ పెడుతున్నాం. దీంతో పాటు మత్స్యకార సోదరుల కోసం జెట్టీ నిర్మాణంతో పాటు అక్కడే అన్ని వసతులు కల్పిస్తాం. పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన హాలు ఏర్పాటు చేస్తాం. షెడ్డులు, బాత్రూరూంలు నిర్మిస్తాం. మార్కెట్‌ చేసుకునేందుకు అనుమతినిస్తాం. కోల్డు స్టోరేజీలు అందుబాటులోకి తెస్తాం’ అని సీఎం జగన్‌ తెలిపారు. అదేవిధంగా మత్స్యకార్మిక దినోత్సవం సందర్భంగా పడవలు, బోట్లు ఉన్న మత్స్యకార్మికులకు రూ.10వేల చొప్పున ఇవ్వబోతున్నామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ పథకం తీసుకువచ్చామని పేర్కొన్నారు.

హామీలు నెరవేర్చి చూపిస్తున్నా..
‘వంశధార నదిపై నేరేడు వద్ద బ్యారేజీ కట్టడంతో పాటు యుద్ధప్రాతిపదికన పనులు జరిగేందుకు చర్యలు తీసుకుంటాం. మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టును పరుగులు తీయిస్తా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే విధంగా సెప్టెంబరు చివరికల్లా సొంత ఆటో, ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి రూ. 10 వేలు ఇస్తాం. అవ్వాతాతల పెన్షన్‌ కూడా సగటున 3 రెట్లు పెంచి వారిని ఆదుకుంటాం. అవ్వాతాతలకు రూ. 2250 పెన్షన్‌ ఇస్తున్నాం. అక్టోబరు 15న రైతు భరోసా పథకం కింద రూ. 12500 ఇస్తాం. 100 రోజుల్లోపే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం. లంచాన్ని, అవినీతిని అరికట్టేందుకు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చాం. ప్రతీ ప్రభుత్వ పథకాన్ని ఇంటింటికీ డోర్‌ డెలివరీ చేస్తాం. డిసెంబరు 21న చేనేత కుటుంబాలకు నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి రూ. 24 వేలు అందజేస్తాం.

అదేవిధంగా జనవరి 26న అమ్మఒడి పథకం ప్రారంభిస్తాం. ఫిబ్రవరి చివరివారంలో షాపులున్న నాయిబ్రాహ్మణులు, రజకులు, టెయిలర్లకు రూ. 10 వేలు ఇస్తాం. మార్చి చివరి వారంలో అర్చకులు, ఇమామ్‌లు, పాస్లర్లకు పూర్తి చేయూత అందిస్తాం. ఉగాది రోజు అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తాం. ఏప్రిల్‌ 2న శ్రీరామనవమి సందర్భంగా వైఎస్సార్‌ పెళ్లి కానుక పథకం అమలు చేస్తాం. అలాగే సున్నావడ్డీ పథకం ద్వారా డబ్బు మొత్తాన్ని నేరుగా అక్కాచెల్లెమ్మల అకౌంట్‌లో వేస్తాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 19 చట్టాలు తెచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గత పాలకులు మాటలు చెప్పి మభ్యపెట్టారు. అందుకు భిన్నంగా నేను ఇచ్చిన హామీలను నేరవేర్చి చూపిస్తున్నా. నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం వారికే కేటాయించేలా చట్టం తెచ్చాము’ అని సీఎం జగన్‌ తన పాలనలో అమలు చేస్తున్న, చేయనున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.



(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement