ఇళ్లల్లోనే ప్రార్థనలు | CM YS Jaganmohan Reddy Appeal To Muslims during Ramadan Season | Sakshi
Sakshi News home page

ఇళ్లల్లోనే ప్రార్థనలు

Published Tue, Apr 21 2020 3:36 AM | Last Updated on Tue, Apr 21 2020 8:02 AM

CM YS Jaganmohan Reddy Appeal To Muslims during Ramadan Season - Sakshi

మాపట్ల వివక్ష లేకుండా చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా గడ్డు పరిస్థితుల్లో ఉన్నా సమర్థవంతంగా విపత్తును ఎదుర్కొంటోంది. ముందుచూపుతో ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ విపత్తును ఎదుర్కోవడానికి బాగా పనికి వచ్చింది. వారి సేవలు అమూల్యమైనవి. ఇవాళ వలంటీర్ల వ్యవస్థ లేకపోయుంటే పరిస్థితి మరోలా ఉండేది.
– సీఎం వైఎస్‌ జగన్‌తో ముస్లిం పెద్దలు

ప్రస్తుత పరిస్థితిలో ఈ రంజాన్‌ మాసంలో అందరూ సహకరించాలని, ఇళ్లలోనే ప్రార్థనలు చేయాలని సూచించాలని అభ్యర్థిస్తున్నాను. ఇది మనసుకు కష్టమైన మాటే అయినా, తప్పనిసరి పరిస్థితుల్లో కోరుతున్నా. దయచేసి అందరూ సహకరించాలి.
– సీఎం

ప్రభుత్వ మార్గదర్శకాలు, వైద్యుల సూచనలు తప్పకుండా పాటిస్తున్నాం. ఎవరూ కూడా వీటిని ఉల్లంఘించకుండా చూసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రంజాన్‌ సమయంలో ఇంట్లోనే ప్రార్థనలు చేసుకునేలా చూస్తాం. 
– సీఎం వైఎస్‌ జగన్‌తో ముస్లిం పెద్దలు

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా భౌతిక దూరం పాటించడంతో పాటు ఎక్కువ మంది ఒకే చోట చేరడం హానికరమైన పరిస్థితుల్లో రంజాన్‌ ప్రార్థనలను ఇళ్లల్లోనే చేసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం పెద్దలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ముస్లిం పెద్దలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఏం చెప్పారంటే.. 

ఇప్పుడేం జరుగుతోందో మీకు తెలుసు 
► పవిత్ర రంజాన్‌ మాసం మరో ఐదు రోజుల్లో మొదలవుతుందనే సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ రంజాన్‌ మాసంలో మామూలుగా ఐదుసార్లు మనమంతా నమాజ్‌కు పోతాం. రాత్రి పూట కూడా అందరూ ఒక చోట ఏకమై తరావీహ్‌ నమాజ్‌ చేస్తాం.  
► ఈ పవిత్ర రంజాన్‌ మాసంలోనే దాన ధర్మాలు ఇంకా ఎక్కువగా చేస్తాం. అయితే ప్రస్తుతం ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతోందనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ కరోనా వైరస్‌ను అధిగమించేందుకు కొద్ది రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.  
► ఈ నేపథ్యంలో ఉగాది, శ్రీరామ నవమి, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ పండుగలను ఇళ్లలోనే జరుపుకున్నాం. ఇప్పుడు రంజాన్‌ రాబోతోంది. అన్ని పండుగల్లోనూ దేవుడికి దగ్గరగా ప్రార్థనా స్థలాల్లో గడపడానికి బదులు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లోకి పోవాల్సి వచ్చింది.
► 14 రోజుల క్వారంటైన్‌  అనంతరం అందరూ పరీక్షలు చేయించుకోవాలి.
ముస్లిం మతపెద్దలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో డిప్యూటీ సీఎంలు అంజాద్‌ బాషా, ఆళ్ల నాని, మంత్రి మోపిదేవి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్‌  

తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలి  
► నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాలు, ఉద్దేశ పూర్వక దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని ముస్లిం పెద్దలు సీఎంకు ఫిర్యాదు చేశారు. కర్నూలులో కోవిడ్‌–19 నివారణ చర్యలు గట్టిగా తీసుకుంటున్నారని, ఈ చర్యలకు అందరూ సహకరిస్తున్నారని చెప్పారు.  
► ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. అయితే కొన్ని పత్రికలు, చానళ్లు ఉద్దేశ పూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ వార్తలు, నకిలీ వీడియోలు ప్రచారం చేస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు, భయాందోళనలు కలిగిస్తున్నారని వివరించారు. కర్నూలు ఎమ్మెల్యే మీద కూడా లేనిపోని ప్రచారాలు చేస్తున్నారన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 
► దీనిపై సీఎం స్పందిస్తూ ఫేక్‌ వార్తలు, తప్పుడు ప్రచారంపై నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి.. చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.  

ప్రభుత్వం బాగా పనిచేస్తోంది
ముస్లిం పెద్దల ప్రశంసలు 
► మా జీవితంలో అధికారులు, వైద్య సిబ్బంది ఇంత సేవ చేయడాన్ని ఎప్పుడూ చూడలేదు. మేము కూడా క్వారంటైన్లకు వెళ్లి, అధికారులతో కలిసి వారికి కౌన్సెలింగ్‌ చేస్తున్నాం. 
► ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కేసుల వ్యాప్తి, విస్తరణ తగ్గుతోంది. ఒక మనిషికి రోజుకు రూ.500 చొప్పున భోజనం కోసం ఖర్చు పెడుతుండటం అభినందనీయం. ఇంతగా సేవచేసే ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. 
► ఫేక్‌ వీడియోలతో ముస్లిం సమాజం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అక్కడక్కడా వివక్ష చూపుతున్నారు. ఈ విష ప్రచారాన్ని నిలువరించాలని కోరుతున్నాం. మర్కజ్‌ ఘటన అనుకోకుండా జరిగింది. ఉద్దేశ పూర్వకంగా జరిగింది కాదు. ఈ ఘటన తర్వాత సీఎం స్పందించిన తీరు చాలా బావుంది. మానవత్వంతో వ్యవహరించాలని, వైరస్‌కు కులం, మతం తేడా లేదని ఇచ్చిన సందేశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement