కుందూ‘లిఫ్ట్‌’.. రైతులకు గిఫ్ట్‌ | CM YS JaganMohan Reddy Says,Lift Irrigation Project To Be Started From Kundu River | Sakshi
Sakshi News home page

కుందూ‘లిఫ్ట్‌’.. రైతులకు గిఫ్ట్‌

Published Thu, Jul 11 2019 9:13 AM | Last Updated on Thu, Jul 11 2019 9:13 AM

CM YS  JaganMohan Reddy Says,Lift Irrigation Project To Be Started From Kundu River - Sakshi

బద్వేలు నియోజకవర్గ రైతాంగానికి ప్రాణాధారమైన బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టుకు నీటి గలగలలు కరువయ్యాయి. నీరొస్తే పండించుకోవచ్చనే అన్నదాత ఆశ నెరవేరడం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, శ్రీశైలం నుంచిఅవసరమైన స్థాయిలో నీటి విడుదల లేకపోవడంతో ప్రాజెక్టు ఉన్నా నీటి కష్టాలు తప్పడం లేదు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 17 టీఎంసీలు అయినా నాలుగేళ్లుగా  కనీసం సగం స్థాయిలో కూడా నీరు చేరడం లేదు. చెంతనే ప్రాజెక్టు ఉన్నా సాగు మాత్రం సున్నా అన్నట్లు రైతుల పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కుందూ నది నుంచి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి సోమవారం జిల్లా పర్యటనలో ప్రకటించారు. ఆయన ప్రకటన ఈ ప్రాంత రైతులకెంతో ఆనందం కలిగించింది

సాక్షి, బద్వేలు : జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో సాగు, తాగునీటి ఇక్కట్లు దశాబ్దాల తరబడి ఉన్నాయి. వీటిని గమనించి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ బ్రహ్మంగారి మఠంలో బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ ప్రాజెక్టుపై తదుపరి ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. ఎట్టకేలకు 1995లో డ్యాం నిర్మాణం పూర్తయింది.   చంద్రబాబు హయాంలో కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. దీంతో రైతులకు నీరు అందని పరిస్థితి. రెండు పర్యాయాలు ఆయన సీఎం అయినా జిల్లాపై శీతకన్ను వేయడంతో అన్నదాతల అవస్థలు తీరలేదు. జిల్లాకు చెందిన పలువురు నేతలు ఎన్నో పర్యాయాలు ఆయన్ను కలిసి బ్రహ్మంసాగర్‌ను పూర్తి చేయాలని కోరినా ప్రయోజనం మాత్రం సున్నా. దీనిపై మాజీ మంత్రి వీరారెడ్డి కూడా పలుమార్లు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. 

అధికారంలోకి రాగానే...
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2004లో సీఎం కాగానే ఆయన మొదటి బడ్జెట్‌లోనే రూ.450 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో సబ్సిడీ రిజర్వాయర్‌–1, సబ్సిడీ రిజర్వాయర్‌–2లతో పాటు ఎడమకాలువ, కుడి కాలువ   
నిర్మాణాలను పూర్తి చేశారు. కేవలం 15 నెలల వ్యవధిలో ఈ పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి  చేయించారు. ఇందుకు గాను కంట్రాక్టరుతో కూడా ప్రతివారం సమీక్ష నిర్వహించారు. 2006 సెప్టెంబరులో సోనియాగాంధీతో ప్రాజెక్టును ప్రారంభించి నీటిని విడుదల చేయించారు.

ఆనందంలో రైతులు
బ్రహ్మంసాగర్‌ పూర్తయితే 1.50 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. వైఎస్‌ ప్రాజెక్టు పూర్తి చేయడంతో 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందింది. సబ్సిడి రిజర్వాయర్‌–1, సబ్సిడి రిజర్వాయర్‌–2 పూర్తి చేసి వాటిలో 4.50 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఈ నీటితో దువ్వూరు, మైదుకూరు మండలాల్లో 20 వేల ఎకరాలు సాగులోకి వచ్చింది. బద్వేలు నియోజకవర్గంలోని కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి,కోడూరు, బద్వేలు, గోపవరం, అట్లూరు మండలాల్లోని 1.20 లక్షల ఎకరాలు ఆయకట్టులోకి వచ్చింది.

శ్రీశైలం నుంచి బ్రహ్మంసాగర్‌కు తెలుగుగంగ జలాలను కాలువల ద్వారా అందిస్తారు. వైఎస్‌ పాలనాకాలంలో 2007లో ఒక్క పర్యాయమే 13.48 టీఎంసీల నీటిని ప్రాజెక్టులో నిల్వ చేశారు. 2008లో 11.56 టీఎంసీలు, 2011లో 11.834, 2012లో 9.835, మరోసారి 12 టీఎంసీల నీటిని ప్రాజెక్టులోకి తీసుకురాగలిగారు. తదుపరి ఏడెనిమిదేళ్లుగా ఐదారు టీఎంసీలకే పరిమితం.  2018లో 4.482, 2017 6.49 టీఎంసీల నీళ్లు మాత్రమే వచ్చాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణాజలాలు తీసుకురాలేని పరిస్థితి నెలకొంది.

డీసీ గోవిందరెడ్డి ఆకుంఠిత కృషి
నాడు వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న డీసీ గోవిందరెడ్డి బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిలో కొంతమేర కృషి చేశారు. వైఎస్‌కు విన్నవించగా ఆయన తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయించారు. కానీ ప్రాజెక్టు నిర్మించినా నికరజలాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గమనించిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సమీపంలో ఉన్న కుందూ నది నుంచి వరద జలాలు వృథాగా పోతున్నాయని, వీటిని వినియోగించుకుంటే కొంత మేర ఇబ్బందులు తప్పుతాయని గ్రహించారు. ఇదే విషయాన్ని ఆయన  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజాసంకల్పయాత్రలో దువ్వూరు వద్ద రైతులు కూడా జగన్‌ను కలిసి విన్నవించారు. కుందూ నది నుంచి వృథాగా పోతున్న వరదనీటిని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా బ్రహ్మంసాగర్‌లోకి ఎత్తి పోయడం ద్వారా కొంతైనా నీటి ఇక్కట్లు తీరతాయి.  జగన్‌  అధికారం చేపట్టగానే నాటి సంకల్పయాత్రలో విన్నపాలపై దృష్టి సారించారు. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టుకు డిసెంబరు 26న శంకుస్థాపన చేస్తామని సోమవారం జమ్మలమడుగులో జరిగిన రైతు సదస్సులో ప్రకటించారు. దీంతో నియోజకవర్గ రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతోంది. 

తండ్రికి తగ్గ తనయుడు 
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్ది ఆపరభగీరథుడికి ప్రతిరూపం. ఆయన చొరవతోనే బ్రహ్మంసాగర్‌ పూర్తయింది. రైతుల రెండు దశాబ్దాల కల నెరవేరింది. ఆయనకు తగ్గ కుమారుడిగా నేడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రైతుల దుస్థితి గమనించి కుందూ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం చాలా సంతోషకరం.

ప్రాజెక్టు పూర్తయిన పదేళ్లకు...
1995లో డ్యాం నిర్మాణం  పూర్తయినా రైతులకు నీళ్లు మాత్రం అందలేదు. అప్పటి సీఎం చంద్రబాబు ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. దీంతో రైతులు ఆశలు నెరవేరలేదు. వైఎస్‌ సీఎం కాగానే ప్రాజెక్టును పూర్తి చేశారు. ఆయనకు రైతులపై ఉన్న ప్రేమ అంతులేనిది. ఆయన మాదిరే జగన్‌ కూడా అపరభగీర«థుడిగా పేరు తెచ్చుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement