ఏఎన్‌యూ: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆయా దేశాలు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నాయి. జమైకా వంటి అతి పేద దేశంతో పాటు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న చైనా కూడా క్రీడారంగానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. భారత్‌లో మాత్రం క్రీడలు ఎప్పుడూ చిన్నచూపేనని క్రీడాకారులు, కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడలకు అంతర్జాతీయ ఖ్యాతి తెస్తామని పాలకులు, అధికారులు చెబుతున్నారే తప్ప వాస్తవానికి జరుగుతున్నది అందుకు విరుద్ధమైన పనులేనని వాపోతున్నారు. ఈ విషయంలో జాతీయ స్థాయి క్రీడారంగ సంస్థ అయిన శాయ్(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) వరకూ అంతటా ఒకటే తీరు అని చెబుతున్నారు. అభిప్రాయాలు వారి మాటల్లోనే..
ఇచ్చే నగదు తిండికే సరి..
అత్యున్నత ప్రమాణాలు, అంకిత భావం ఉన్న కోచ్‌లు, నైపుణ్యం ఉండి లక్ష్యం సాధించాలనే క్రీడాకారులతోనే విజయాలు సాధ్యమవుతాయి. అలాంటి పరిస్థితి లేనప్పుడు విజయాలు సుదూరం. ప్రభుత్వం వారిని ప్రోత్సహించకుండా జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పంపినా నిష్ప్రయోజనం. నైపుణ్యం ఉన్న క్రీడాకారులు ఎందరో ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లేక క్రీడారంగానికి దూరవవుతున్నారు. ప్రస్తుతం శాయ్ ఒక్కో క్రీడాకారుడికి ఒక రోజుకు రూ.250 వెచ్చిస్తోంది. అది తిండికి సరిపోతుంది. ఇక ఇతర పరికరాలు, బట్టలు, షూస్ కొనుగోలు ఎలా? సరైన వనరులు ఉండాల్సిందే..! – డీఏ వినాయక ప్రసాద్, శాయ్ కోచ్
ప్రోత్సహిస్తేనే విజయాలు
ఇతర దేశాల క్రీడా విధానం, ప్రోత్సాహకాలతో మన దేశ విధానాన్ని పోల్చుకోవడం సరికాదు. గతంలో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది. అంతర్జాతీయ పతకాలను సాధించే అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇంకా పెరగాలి. క్రీడారంగంలోని అధికారులు, కోచ్‌లు, విధాన రూపకర్తలు అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించొచ్చు. మన దేశంలో ఎంతో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు ఉన్నారు. వారికి అన్ని అంశాల్లో ప్రోత్సాహం అందిస్తేనే ఆశించిన లక్ష్యాన్ని చేరుకోగలం. చైనా, రష్యా వంటి దేశాల్లో స్కూల్లోనే ట్రాక్‌లు, ప్రత్యేకమైన స్పోర్ట్స్ అకాడమీలు ఉన్నాయి. – పీటీ ఉష, అర్జున అవార్డు గ్రహీత, కోచ్
నైపుణ్యం ఉన్నా ప్రోత్సాహం కరువు
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాల్లో ఎందరో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నారు. వారికి మూడుపూటలా తిండిపెట్టి వసతులు కల్పిస్తే వారు మంచి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంది. వారిని గుర్తించి ప్రాథమిక దశ నుంచే ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణతో రూపొందించాలి. ప్రస్తుతం ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఆశించిన స్థాయిలో లేదు. సాధనకు పరికరాలు కనీసం కాళ్లకు షూస్ కూడా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరిస్థితి మారాలి. – సుబ్బారావు, శాయ్ కోచ్ , ఔరంగాబాద్
Comments
Please login to add a commentAdd a comment