- కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటాం
- చంద్రబాబు తీరును దుయ్యబట్టేందుకే కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు
- వైఎస్‌ఆర్‌సీపీ త్రిసభ్య కమిటీ సభ్యుడు విజయసాయిరెడ్డి
విజయనగరం మున్సిపాల్టీ/కంటోన్మెంట్: ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, త్రిసభ్య కమిటీ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మాట మార్చి ప్రజల్ని మభ్య పెడుతున్నారన్నారు. జరుగుతున్న మోసాన్ని తెలియజేసేందుకు, ప్రజల ఆవేదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు డిసెంబర్ 5న కలెక్టరేట్‌ల వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు.
విజయనగరం సమీపంలోని ఆర్‌కే టౌన్‌పిష్‌లో గురువారం జరిగిన జిల్లా పార్టీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి, చంద్రబాబుకు మధ్య ఎంతో తేడా ఉందన్నారు. జిల్లాలో 2.48 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనన్నారు. ఇందుకోసం రూ. 853 కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. అలాగే తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు ద్వారా రెండు టీఎంసీల తాగునీరు, 25వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిధులు విడుదల చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని చెప్పారు.
రాజీవ్ క్రీడా మైదానం, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కాలేజీ నిర్మించారని, 15వేల మందికి ఇళ్లపట్టాలు మంజూరు చేసి, 4,04,972 ఇందిరమ్మ ఇళ్లు కట్టించారని చెప్పారు. అలాగే 20,033 ఎకరాలను నిరుపేదలకు పంచిపెట్టారన్నారు. వైఎస్ అధికారంలోకి రాకముందు 59 వేల పింఛన్లుంటే, ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత వాటి మొత్తాలను పెంచారన్నారు. అదనంగా 2.81లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారన్నారు. ఇన్ని చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డికీ, చంద్రబాబుకు ఎంతో తేడా ఉందన్నారు. జిల్లాలో వైఎస్ హయాంలో ఒకే ఒక జీఓతో రుణమాఫీ వర్తింపజేస్తే, చంద్రబాబు 3.20 లక్షల మందికి 1,157 కోట్ల రుణ మాఫీకి ఎన్నో వంకలు పెడుతున్నారని ఆరోపించారు.
సాధికారత సంస్థకు చంద్రబాబు రూ. 5వేల కోట్లు జమ చేశారని, ఆ సొమ్ము వడ్డీకి కూడా చాలదన్న విషయం గుర్తెరగాలన్నారు. రుణమాఫీ లబ్ధిదారుల్లో 45వేల మందిని తొలగించారన్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న ఫెర్రో అల్లాయీస్, జూట్ పరిశ్రమలు మూతపడడంతో దాదాపు 30 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. చంద్రబాబు అసమర్థత వల్లే ఇలా జరిగిందని విమర్శించారు. రెండు రూపాయలకు ఎన్టీఆర్ ఇచ్చిన బియ్యం ధరను చంద్రబాబు రెండు సార్లు పెంచితే, వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చి కోటా బియ్యాన్ని కిలో రూపాయికి ప్రకటించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
కనిపించిన వారందరికీ రుణమాఫీ అని ప్రకటించిన చంద్రబాబు నాయుడు కేవలం అధికారం కోసమే తప్పుడు హామీలిచ్చారని పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. కేంద్రంలో మోదీ ఉన్నారు, నిధులు తెచ్చి రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు, ఎందుకు నిధులు అడగడం లేదో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రం విడిపోతే ప్రత్యేక ప్రతిపత్తిని ఐదేళ్ల పాటు కల్పిస్తామని కేంద్రం చెప్పినప్పుడు బీజేపీతో కలిసి ఐదు కాదు పదిలేదా పదిహేనేళ్లు కావాలని కోరిన బాబు ఇప్పుడు ఆ స్వయం ప్రతిపత్తి గూర్చి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రైతులకు 87,612 కోట్ల రూపాయలు, డ్వాక్రా మహిళలకు రూ.14వేల కోట్లు మాఫీ చేస్తానన్న చంద్రబాబు అర్హత లేదని చాలా మంది రైతుల పేర్లను జాబితాల్లోంచి తొలగించారన్నారు.
జపాన్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు ..తుపానులు రాకుండా నివారించేందుకు అక్కడ స్టడీ చేస్తుండడాన్ని ప్రజలు హాస్యాస్పందంగా తీసుకుంటున్నారన్నారు. ఇంటికో ఉద్యోగమిస్తామని, లేకుంటే రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయ న్నారు. బ్యాంకులతో నిత్యం చక్కని లావాదేవీలు నడుపుతున్న మహిళలకు చంద్రబాబు ఇచ్చిన హామీలతో బ్యాంకులు, మహిళల మధ్య సత్సంబంధాలు పోయాయన్నారు.
బాబు మోసాలపై ప్రజాపక్షాన పోరు
Published Fri, Nov 28 2014 3:19 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement