పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): వేసవికి ముందే వేడి మొదలైంది. కొద్దిరోజుల్లో సార్వత్రికఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో రాజకీయంగా హడావుడి మొదలైంది. పాలనపరంగానూ వేడి రాజుకుంది. అధికార యంత్రాంగం పూర్తిగా ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. నిన్నమొన్నటి వరకూ ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులంటూ సమీక్షలు, సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనల్లో బిజీగా గడిపిన అధికారులు ఒక్కసారిగా ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని ఏలూరు, నర్సాపురం లోక్‌సభ స్థానాలతో సహా 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారయంత్రాంగం శరవేగంగా దూసుకుపోతోంది.
ప్రారంభమైన ఏర్పాట్లు
ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు జిల్లాల అధికారులతో తరచూ వీడియోకాన్ఫరెన్స్, సమీక్షలు నిర్వహిస్తున్నాయి. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. శాంతిభధ్రతల విషయంలో అప్రమత్తం గా ఉండాలని సూచించాయి. దీంతో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అధికారుల బదిలీలూ ప్రారంభమయ్యాయి. పోలీసు, రెవెన్యూ శాఖల్లో బదిలీలు ఇప్పటికే పూర్తయ్యాయి.
పోలింగ్ కేంద్రాల తనిఖీ
జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సన్నద్ధమయ్యారు. ఇప్పటికే జిల్లాలోని 3,411 పోలింగ్ కేంద్రాల తనిఖీకి చర్యలు తీసుకున్నారు. వీవీప్యాట్‌లు, ఈవీఎంలు భద్రపరిచే గోదామును సోమవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వారీగా సమస్త సమచారాన్ని నివేదికల రూపంలో సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులతోసహా సాంకేతిక సౌకర్యాల కల్పనపై నివేదికలు సిద్ధం చేశారు. ఇదే సమయంలో గత ఎన్నికలలో చోటు చేసుకున్న ఘటనలు, కేసులు, రాజకీయ నేతల పాత్రపై ఇప్పటికే పూర్తిస్థాయిలో సమాచారాన్ని పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి రూపొందిస్తున్నారు. ఇదే నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలతో జిల్లా రెవెన్యూ అధికారి, జాయింట్ కలెక్టర్ పలుమార్లు సమావేశమయ్యారు.
అదనపు అధికారుల నియామకం
ఎన్నికల నిర్వహణకు జిల్లాను జోన్లు, రూట్లుగా విభజించి అధికారులను నియమించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నియమావళి అమలు, పోస్టల్ బ్యాలెట్లు, సెక్టోరల్, జోనల్ అధికారులు, వ్యయ పరిశీలకులు, వీడియో వ్యూయింగ్, తనిఖీ బృందాలు, కంట్రోల్ రూములు, ఎంసీఎంసీ కమిటీ, ఈవీఎంల నిర్వహణ వంటి 27 రకాల పనుల కోసం, 16 మంది నోడల్ అధికారులను జిల్లాస్థాయిలో నియమించేందుకు అంచనా రూపొందించారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు 25వేల మంది ఎన్నికల సిబ్బంది అవసరమని అంచనావేశారు. ఈ మేరకు అధికారులు జాబితాను సిద్ధం చేశారు.
జిల్లాలో ఇలా ..
ఓటర్లు : 30,57,922
జిల్లా జనాభా : 42,83,945
పోలింగ్‌స్టేషన్లు : 3,411
అసెంబ్లీ స్థానాలు : 15
లోక్‌సభ స్థానాలు : 2
అవసరతలు ఇలా..
ఎన్నికలకునోడల్ అధికారులు : 16మంది
ఎన్నికల సిబ్బంది : 25వేల మంది
బ్యాలెట్ యూనిట్లు
(ఈవీఎం) : 10,916
వీవీప్యాట్‌లు : 8,341
Comments
Please login to add a commentAdd a comment