కలెక్టరేట్ ఎదుట ‘తప్పెట' హోరు
అనంతపురం అర్బన్: ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మాదిగ హక్కుల తప్పెట కళాకారులు సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు సప్తగిరి సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీగా వెళ్లి తప్పెట్ల మోతతో హోరెత్తించి నిరసన తెలిపారు. మాదిగలకు ఇచ్చిన హామీలను విస్మరించి ముఖ్యమంత్రి చీకటి చంద్రుడయ్యారని నాయకులు ధ్వజమెత్తారు. జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అధ్యక్షతన చేపట్టిన ధర్నాలో వ్యవస్థాపక అధ్యక్షుడు పేరూరు శ్రీరాములు మాట్లాడారు.
మాదిగలను అన్ని విధాలుగా అదుకుంటామని, తప్పెట కళాకారుల శ్రేయస్సు కోసం ఆర్థిక ప్రణాళిక రూపొందించి వారి జీవితాల్లో వెలుగునింపుతామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వానికి, గ్రామానికి వారధులుగా పనిచేసే తప్పెట కళాకారుల అభివృద్ధిని ప్రభుత్వాలన్నీ విస్మరిస్తున్నాయన్నారు. జిల్లాలో అందరు కళాకారులకరూ ప్రభుత్వం పింఛన్ అందజేస్తుందన్నారు. కానీ తప్పెట కళాకారులను విస్మరించిందని విచారం వ్యక్తం చేశారు.
పింఛన్లు అందజేస్తామని తప్పెట కళాకారులకు హామీ ఇచ్చిన బాబు ఇప్పటి వరకూ అమలు చేయాలేదన్నారు. ప్రతి తప్పెట కళాకారునికి నెలకు రూ. 2 వేల పింఛను, 3 ఎకరాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రుణాలను మంజూరు చేయాలన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఖాజా మొహిద్దీన్‌కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పర్వతప్ప, ఉపాధ్యక్షుడు ఎవి.రమణ, ఆంజినేయ్య, శెట్టూరు హనుమప్ప, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.