
సాక్షి, కదిరి టౌన్: కదిరి ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం టిక్‌టాక్ వీడియోలు కలకలం రేపాయి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ టిక్‌టాక్ వీడియోలు చిత్రీకరిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిపై జిల్లా వైద్య శాఖతో పాటు కలెక్టర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఉద్యోగినితోపాటు సహకరించిన మరో ఉద్యోగిని విధుల నుంచి తప్పించారు. వివరాల్లోకెళితే.. కదిరి ప్రభుత్వాస్పత్రిలో సద్గుణ, శైలజ మెడాల్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. వీరు ల్యాబ్‌లోనే కాలక్షేపానికి టిక్‌టాక్ వీడియోలు చిత్రీకరించుకుని పోస్ట్ చేసేవారు.
అందులో భాగంగానే శుక్రవారం కూడా వీడియోలు తీశారు. దీంతో ల్యాబ్‌లో పరీక్షల కోసం వచ్చిన కొందరు రోగులు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్‌కు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన ఆయన ముందుగా వారికి మెమో ఇచ్చారు. అనంతరం జిల్లా వైద్యాధికారులు, కలెక్టర్ సత్యనారాయణలు ఇదే విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారిని విధుల నుంచి పూర్తిగా తొలగించాలని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రమేష్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ వీడియోతో నాకు సంబంధం లేదు
టిక్‌టాక్ వీడియోతో తనకు సంబంధమేమీ లేదని ల్యాబ్‌టెక్నీషియన్ సద్గుణ రోదించింది. ఆస్పత్రి క్యాంటీన్‌లో కావాలనే శైలజ తనను వీడియోలో కనపడేటట్లు చేసిందని తెలిపింది. క్యాంటీన్ వీడియోలో మాత్రమే తానున్నానని, ల్యాబ్‌లో చిత్రీకరించిన వీడియోలో తాను లేనని స్పష్టం చేసింది. ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment