కలెక్టర్ చీకటి పాలన
అనారోగ్యం పాలవుతున్న అధికారులు
మర్యాద కూడా తెలియని అధికారి
ఎమ్మెల్యే చెవిరెడ్డి విమర్శలు
ఐరాల : మిట్ట మధ్యాహ్నం లేచి... సాయంత్రం కార్యాలయానికి వచ్చి... అర్ధరాత్రి చీకట్లో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ పాలనసాగిస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ చీకట్లో పాలన చేస్తున్న కలెక్టర్ వ్యవహార శైలివల్ల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సమస్యలను చెప్పుకునే వీలుపడడం లేద న్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులే కాకుండా గ్రామీణ స్థాయిలో ఉన్న సిబ్బంది కూడా కలెక్టర్ ప్రవర్తన వల్ల తిండిలేక , నిద్రలేక అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. కొందరు ఉద్యోగులు ఇక భరించలేక వేరే జిల్లాకు బదిలీ చేయమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారని చెప్పారు. జిల్లా స్థాయి అధికారులను సైతం కలెక్టర్ మర్యాద లేకుండా మాట్లాడడం బాధాకరమన్నారు. మంచి, మర్యాద లేని వ్యక్తి జిల్లా కలెక్టర్ ఎలా అయ్యారో ఆ దేవుడేకే తెలియాలన్నారు. పచ్చికబయళ్లతో నందనవనంలా ఉన్న కలెక్టర్ కార్యాలయాన్ని శ్మశానవాటిక వాతావరణంలా మార్చిన ఘనత కలెక్టర్‌కే దక్కుతుందన్నారు.
విజయవంతమైన కార్యక్రమాన్ని ఆయన గొప్పగాను, తేడా వస్తే తప్పు అధికారులదంటూ తోసివేసే సంస్కృతి కలిగిన వ్యక్తి సిద్ధార్థ్‌జైన్ అని విద్యార్థులు వాపోతున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసుకోలేని దీనస్థితిలో జిల్లా యంత్రాంగం ఉందన్నారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలిని తెలుగుతమ్ముళ్లు సైతం బహిరంగంగా విమర్శిస్తున్నారని అన్నారు. జిల్లాలో అస్తవ్యస్తపాలన నడుస్తున్నా కాకిలెక్కలు, కాకమ్మ కబుర్లతో ముఖ్యమంత్రిని సైతం తప్పుదారిపట్టిస్తూ పదవులను కాపాడుకునేందుకు ఐఏఎస్‌లు ప్రయత్నించడం దారుణమన్నారు. కొందరు అధికారుల వల్ల ఐఏఎస్ వ్యవస్థకే మచ్చ ఏర్పడుతోందన్నారు. కలెక్టర్ తీరుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు దీక్షకు దిగుతున్నారంటే పరిస్థితి తీవ్రతకు అర్థంపడుతుందని, త్వరలోనే ప్రజలు సైతం రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపే దుస్థితి ఏర్పడుతుందని తెలిపారు. జిల్లాలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను ముఖ్యమంత్రికి లేఖ ద్వారా పంపుతున్నామని, ఆయన అయినా జిల్లాను కాపాడుతారా అని ముఖ్యమంత్రి విజ్ఞతకే వదలివేస్తున్నామని తెలిపారు.
సెలవుపై వెళ్లిన కలెక్టర్
చిత్తూరు (సెంట్రల్): జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ వ్యక్తిగత పనుల నిమిత్తం శనివారం సెలవుపై వెళ్లారు. శుక్రవారం హోలీ పర్వదినం, ఆదివారం జాతీయ సెలవుదినం కావడంతో పైఅధికారుల అనుమతితో సెలవుపై వెళ్లారు. తిరిగి ఆయన సోమవారం జిల్లాలో విధులకు హాజరుకానున్నారు. కలెక్టర్ వచ్చేంత వరకు ఇన్‌చార్జ్ కలెక్టర్ జేసీ నారాయణభరత్‌గుప్త వ్యవహరించనున్నారు.