
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో కరోనా నియంత్రణకు అధికారులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రెడ్ జోన్లలో అవలంభిస్తోన్న జియోగ్రాఫికల్ క్వారెంటైన్ పద్ధతి సత్ఫలితాలను ఇస్తోంది. కృష్ణలంక, కార్మికనగర్, విద్యాధరపురం,అజిత్‌సింగ్‌నగర్, ఖుద్దూస్‌గర్‌లలో అమలు చేస్తున్నారు. ఈ పద్ధతి అమల్లో ఉన్న ప్రాంతాల్లో రాకపోకలు నిషేధించామని.. అందరికీ పరీక్షలు నిర్వహించి లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ప్రభుత్వ శాఖల శ్రమతో కరోనా నియంత్రణలోకి వస్తుందని పేర్కొన్నారు.
కోలుకునే వారి సంఖ్య పెరుగుతుంది..
రెడ్‌జోన్ లలో వైద్య శిబిరాలకు విశేష స్పందన వస్తోందన్నారు. పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని చెప్పారు. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందన్నారు. రాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 8 వేల మందికి పరీక్షలు నిర్వహించామని.. ట్రూ నాట్, డిఆర్‌డీఎల్, ఇతర పద్దతుల ద్వారా మరో 12,000 మందికి టెస్టులు చేశామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు పరీక్షల్లో 2.5 శాతం మందికే పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ తెలిపారు.
మాంసం,చేపల విక్రయాలు నిషేధం: కమిషనర్
కరోనా కట్టడిలో భాగంగా మాంసం,చేపల విక్రయాలపై నిషేధం విధించినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రేపు(ఆదివారం) చికెన్,మటన్,చేపల విక్రయాలు నిలిపివేస్తున్నామని వెల్లడించారు. కబేళా,చేపల మార్కెట్‌ను మూసేస్తున్నామని పేర్కొన్నారు. ఎవరైనా విక్రయాలు జరిపితే కఠినచర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment