సమైక్య సమ్మె ప్రభావంతో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఎం. రఘునందరావు సూచించారు.
సత్వరమే పరిష్కరించండి : కలెక్టర్ : కైకలూరు, న్యూస్‌లైన్ : సమైక్య సమ్మె ప్రభావంతో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఎం. రఘునందరావు సూచించారు. బుధవారం ఆయన కైకలూరులోని తహశీల్దార్, పంచాయతీరాజ్, మండల మహిళా సంఘం, హౌసింగ్ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించారు.
తహశీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో వెంకటసుబ్బయ్య, తహశీల్దార్ డీ విజయశేఖర్, ఎంపీడీవో నిమ్మగడ్డ బాలాజీ, ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మీతో సమీక్షాసమావేశం నిర్వహించారు. రెవెన్యూ రికార్డులకు ఆధార్ నెంబరును తప్పనిసరిగా అనుసంధానం చేయాలని చెప్పారు. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న గృహాలను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐసీడీఎస్ ద్వారా చిన్నారులకు అందుతున్న పోషకాహార పంపిణీపై ఆరా తీశారు. అంగన్‌వాడీ కార్యకర్తల భర్తీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అనంతరం మండల మహిళా సమైక్య భవనాన్ని సందర్శించి గ్రూపులకు రుణాలు ఏ మేరకు అందుతున్నాయనే విషయాలను డ్వాక్రా గ్రూపు లీడర్ల నుంచి తెలుసుకున్నారు. మండలంలో వికలాంగ సంఘాలను ఏర్పాటు చేసి వారికి రుణాలు వచ్చేవిధంగా కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో 7వ విడత భూపంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఎసైన్డ్‌మెంటు కమిటీ సభ్యుడు కాలి రాజ్‌కుమార్ కలెక్టర్‌కు అర్జీ అందించారు. అదే విధంగా బైపాస్‌రోడ్డులో కోత మిషన్ కారణంగా ఆనారోగ్యం పాలవుతున్నామని అన్నం సుబ్రహ్మణ్యం ఆయనకు వినతిపత్రం సమర్పించారు.
పెండింగ్ అర్జీల పరిష్కారం...
విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్డాడుతూ రెండు నెలలుగా మీ సేవాలో పెండింగ్‌లో ఉన్న అర్జీలను పరిష్కరించడానికి చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో 35 వేల వరకు మీ సేవాలో అర్జీలు పరిఫ్కారం కావాల్సి ఉందన్నారు. అధికారులు నాలుగు రోజుల్లో వీటిని పరిష్కరిస్తారని ఆయన చెప్పారు. ప్రధానంగా ఎస్సీ, బీసీ, మైనార్టీలకు రుణాల మంజూరుకు ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
జిల్లాలో ఆధార్ కార్డుల జారీ పక్రియ 96 శాతం పూర్తయ్యిందన్నారు. అనేక మందికి ఇంకా ఆధార్‌కార్డులు రావాల్సిఉందన్నారు. త్వరగా అందే విధంగా చర్యలు తీసుకుంటాని తెలిపారు. కొల్లేరులో నిబంధనలకు విరుద్ధంగా తవ్విన చెరువుల యజమానులపై తహశీల్దార్‌కు ఫిర్యాదు చేస్తే... పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కొల్లేరు ప్రాంతాల్లోని డ్రైయినేజీల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగించే విధంగా ఆ శాఖ ఈఈతో మాట్లాడతానని అన్నారు. కార్యక్రమంలో పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.