జడివానలో సుడిగాలి పర్యటన
- గిరిజనుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్
- బెంగళూరు తరహాలో కాఫీ అభివృద్ధికి చర్యలు
- పిల్లలను పాఠశాలకు పంపకుంటే రేషన్ కార్డు రద్దు
చింతపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ జోరువానలోను సుడిగాలి పర్యటన జరిపారు. ముందుగా లంబసింగి ప్రాంతాన్ని సందర్శించిన ఆయన అక్కడ గిరిజనులు సాగు చేస్తున్న కాఫీతోటలను పరిశీలించారు. బెంగళూరు తరహాలో కాఫీలో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు రైతులకు మెలకువలు నేర్పిస్తామని, ఈ మేరకు ఏజెన్సీ ప్రాంతంలో ఎంపిక చేసిన కొందరు రైతులకు అవగాహన కల్పించేందుకు బెంగళూరుకు పంపిస్తామన్నారు.
లంబసింగి ప్రాంతంలోని మహిళలు, గిరిజనులతో మాట్లాడుతూ పిల్లలను పాఠశాలలకు పంపించే బాధ్యత తల్లితండ్రులే వహించాలన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపించకపోతే రేషన్‌కార్డులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. తాజంగిలో ఐటీడీఏకు చెందిన వ్యవసాయ క్షేత్ర భూములు పరిశీలించారు. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు 38 ఎకరాల భూమిని టూరిజం శాఖకు అప్పగించడంతో ఇంతకాలం ఆ భూములను నమ్ముకొనివున్న తాము రోడ్డున పడతామని స్థానిక గిరిజనులు మొరపెట్టుకున్నారు. అర్హులైన పేదలకు న్యాయం చేస్తామని కలెక్టర్ చెప్పారు. స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిని సందర్శించారు.
పీహెచ్‌సీ భవనానికి విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్రాలగొప్పు గ్రామాన్ని సందర్శించి పండ్ల వ్యాపారాన్ని పరిశీలించారు. చింతపల్లిలో ఆస్పత్రి, యువజన శిక్షణ కేంద్రాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ ఎం.హరినారాయణన్, సబ్‌కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్, చింతపల్లి డీఎస్పీ రాఘవేంద్ర, కాఫీ ప్రాజెక్టు అధికారి చిట్టిబాబు, డీఈ మోహన్‌రావు, జేఈలు జయరాం, వెంకటరమణ, ఎంపీడీఓ సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు.
రక్తహీనత నివారణకు చర్యలు
చింతపల్లి: బాలికల్లో రక్తహీనత నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ యువరాజ్ అన్నారు. శనివారం చింతపల్లి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లోని 12 ఏళ్లు పైబడిన బాలికల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటుందని, దాని నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. లంబసింగి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ పర్యాటకశాఖ చర్యలు చేపడుతుందని ఆయన తెలిపారు. ఏజెన్సీలో వైద్య ఆరోగ్యశాఖ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. మాతా, శిశు మరణాల నివారణకు పకడ్బంది చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కూరుకుపోయిన పీవో కారు
చింతపల్లి: మండలంలోని చిట్రాలగొప్పు వద్ద పాడేరు ఐటీడీఏ పీఓ హరినారాయణన్ కారు బురదలో కూరుకుపోయింది. దీంతో కొంతసేపు అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది. కలెక్టర్ యువరాజ్‌తోపాటు చిట్రాలగొప్పు వచ్చిన పీఓ కారు వెనక్కు తిప్పుతుండగా బురదలో కూరుకుపోయింది. దీంతో పీఓను కలెక్టర్ తన కారులో తీసుకుపోయారు. కొంత సేపటికి సిబ్బంది కారును రోడ్డెక్కించి ఊపిరిపీల్చుకున్నారు.
చిన్నారికి కలెక్టర్ లాలింపు
చింతపల్లి: జిల్లా కలెక్టర్ యువరాజ్ శనివారం చిట్రాలగొప్పులోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అధికారుల బృందమంతా ఒకేసారి అంగన్‌వాడీ కేంద్రానికి వస్తుండటంతో అక్కడ ఉన్న ఒక చిన్నారి ఏడుపు అందుకుంది. దీంతో కలెక్టర్ యువరాజ్ ఆ చిన్నారిని స్వయంగా ఎత్తుకొని లాలించి ఓదార్చారు. అక్కడ ఉన్న బొమ్మలు, ఆట వస్తువులు చూపిస్తు చంటిపాప ఏడుపును నిలువరించారు. అక్కడ పిల్లలకు పెడుతున్న పోషకాహారాన్ని పరిశీలించారు.