
కాంగ్రెస్‌లోకి తిరిగిరండి: రఘువీరారెడ్డి
కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వదిలివెళ్లడం సరికాదని, పార్టీని వీడిన నేతలంతా తిరిగి రావాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు.
పార్టీని వదిలివెళ్లిన వారికి రఘువీరారెడ్డి పిలుపు
సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి బాగుందని చెప్పలేను
పార్టీ ఓటమి పాలైతే ఆ అప్రతిష్ట నేనే మోస్తా..
అధిష్టానం ఆదేశిస్తే పోటీ
కిరణ్ పార్టీ గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వదిలివెళ్లడం సరికాదని, పార్టీని వీడిన నేతలంతా తిరిగి రావాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో సమష్టిగా కాంగ్రెస్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని విన్నవించారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఆయన ఇక్కడి ఓ ప్రైవేటు హోటల్‌లో తొలిసారిగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీని వీడిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘విభజనతో ప్రజలు ఆదరించరనో, ఓట్లు పడవనో మీకు భయం ఉన్నట్లుంది. అంతలా భయపడాల్సిన పని లేదు. చేవలేని వాళ్లమా? చేతకాని వాళ్లమా? రాజకీయాలకు కొత్తా? కాంగ్రెస్ ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నో చూసింది. ఆయా సందర్భాల్లో ప్రజల నుంచి తొలుత వ్యతిరేకత వచ్చినా అవన్నీ తాత్కాలికమే అయ్యాయి.
మళ్లీ కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించారు’’ అని చెప్పారు. పార్టీని ఆది నుంచి ద్వేషించేవారు, పార్టీలోనే ఉంటూ పదవులు అనుభవించిన కొందరు కాంగ్రెస్‌పై విషం కక్కుతున్నారని, ఈ సమయంలో కార్యకర్తలు పార్టీకి అండగా నిలవాలని కోరారు. సీపీఎం మినహా అన్ని పార్టీలు అంగీకరించాకే తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని, దీనికి కాంగ్రెస్ పార్టీనే తప్పుబట్టడం సరికాదన్నారు. సోనియా, మన్మోహన్ సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలను, పోలవరానికి జాతీయహోదా వంటివి బిల్లులో పొందుపరిచారన్నారు. ఇవి ఆచరణలోకి రావాలంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు వీలుగా ఆనం రామనారాయణరెడ్డి నేతృత్వంలో మేనిఫెస్టో, విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నామని, చిరంజీవి నేతృత్వంలో పక్కా ప్రణాళికతో ప్రచారాన్ని సాగిస్తామన్నారు. చిరు సోదరుడు పవన్‌కల్యాణ్ కొత్త పార్టీ గురించి ప్రస్తావిస్తూ.. భార్యాభర్తలు, అన్నదమ్ములు ముఖాముఖి పోటీపడుతుంటారని, పవన్ పార్టీ కూడా అలాంటిదేనన్నారు.
కిరణ్ పార్టీ గురించి విలేకరులు ప్రశ్నించగా వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీమాంధ్రలో మునిగిపోయిన నావగా ఉన్న కాంగ్రెస్ బాధ్యతలను మీకు అప్పగించడంపై ఎలా భావిస్తున్నారని ప్రశ్నించగా ‘‘కాంగ్రెస్ పరిస్థితిపై పెద్దగా విశ్లేషణ అవసరం లేదు. పార్టీ పరిస్థితి బాగోలేదన్న విషయం అందరికీ తెలుసు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. నిజమైన కార్యకర్తలు, నేతలు కష్టమైనా నష్టమైనా పార్టీలోనే ఉంటారు’’ అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ఆ అప్రతిష్ట తానే మోస్తానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే తాను భావిస్తున్నానని, అంతిమంగా పార్టీ ఎలా చెబితే అలా నడుస్తానన్నారు. తెలంగాణలో ఎస్సీలకు సీఎం పదవి ఇస్తామని కాంగ్రెస్ చెబుతోందని, సీమాంధ్రలో ఎవరికి అవకాశమిస్తారని అడగ్గా.. తాను చిన్నవాడినని రఘువీరా స్పందించారు. తన ఎంపికపై పార్టీలో అసంతృప్తి ఉందో లేదో తనకు తెలియదని, తన కన్నా సీనియర్లు అనేకమంది ఉన్నారని, వారిలో ఎవరిని అధ్యక్షునిగా చేసినా సంతోషించే వాడినని రఘువీరా చెప్పారు. ఏపీపీసీసీ ఎన్నికల కమిటీ, మేనిఫెస్టో, ప్రచార కమిటీలతో శనివారం దిగ్విజయ్‌సింగ్ సమావేశమవుతారని చెప్పారు.