విజయనగరం కంటోన్మెంట్: రేషన్ డీలర్లకు పెంచిన కమీషన్‌ను వెంటనే చెల్లించాలని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుగత వెంకటేశ్వరరావు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి కె.నిర్మలాబాయిని కోరారు. బుధవారం ఆయన జిల్లా రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులతో కలిసి ఆమెను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెంచిన కమీషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు అమలు చేయలేదని అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న కమీషన్ సరిపోక డీలర్లు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. నిర్వహణ ఖర్చులు తడిసిమోపెడవుతుండటంతో డిపోల నిర్వహణ కష్టసాధ్యంగా ఉందని వాపోయారు. పెంచిన కమీషన్‌ను వెంటనే చెల్లించకపోతే సరుకులు పంపిణీ చేయలేమన్నారు. జిల్లాలోని 305 రేషన్ దుకాణాల్లో ఈ-పోస్ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. నెట్‌వర్క్ సరిగా లేకపోవడం, 3జీ సిమ్‌లు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు.
డీఎస్‌వో నిర్మలాబాయి మాట్లాడుతూ డీలర్లకు ప్రకటించిన కమీషన్ త్వరలోనే ఇవ్వనున్నట్టు ఉన్నతాధికారులు ప్రకటించారన్నారు. త్వరలోనే పెంచిన కమీషన్‌ను చెల్లిస్తామని, ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం సరుకులను ఈ-పోస్ విధానంలోనే పంపిణీ చేయాలని డీలర్లను కోరారు. జిల్లా డీలర్ల సంఘం ఉపాధ్యక్షుడు సముద్రపు రామారావు మాట్లాడుతూ ఎంఎల్‌ఎస్ పాయింట్లలో ఈ-వెయింగ్ అమలు చేయడం లేదన్నారు. దీనివల్ల తూకంలో తక్కువ సరుకులు వస్తున్నాయన్నారు. మరోవైపు హమాలీలకు ఎక్కువ కూలీ ఇవ్వాల్సి వస్తున్నదన్నారు. ఈ-పోస్ ద్వారా సరుకులు పంపిణీ చే స్తున్న డీలర్లకు పెంచిన కమీషన్‌ను వెంటనే ఇవ్వాలన్నారు. లేకుంటే వచ్చే నెల నుంచి ఈ-పోస్ మెషీన్లు అధికారులకు అప్పగించి సాధారణ తూకం ద్వారా సరుకులు అందిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఏఎస్‌వో ఐబీ.సుబ్రహ్మణ్యం, శంకర్ పట్నాయక్, కేఏజే గుప్త, అప్పారావు, జగ్గయ్యశెట్టి, కె.భీమారావు తదితరులు పాల్గొన్నారు.
పెంచిన కమీషన్ వెంటనే చెల్లించాలి
Published Thu, Jul 9 2015 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM
Advertisement