
సామాన్యుడి కి ధరాఘాతం
సాక్షి, కడప : రాష్ట్ర విభజన దెబ్బ నుంచి జనం కోలుకోనేలేదు.. ఇంతలోనే సామాన్యుడికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రైతులు కరువుతో అల్లాడుతున్నారు.. ధరలు ఆకాశంలో... ఉద్యోగులకు జీతాలు ఎక్కడివక్కడే... ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు సైతం నిలిపివేసింది... ఇవన్నీ చాలవన్నట్లు తాజాగా చంద్రబాబు సర్కార్ సామాన్యుడిపై మరో రెండు పిడుగులు కురిపించింది. ఖజానా నింపుకోవడమే తన మొదటి ప్రాధాన్యత అని సీఎం చంద్రబాబు చెప్పకనే చెప్పారు. ఒకపక్క పెట్రోలు, డీజిల్‌పై టీడీపీ సర్కాల్ విలువ ఆధారిత పన్ను (వ్యాట్) మోత మోగించడంతో వాహనదారులపై భారీ వడ్డన పడింది.
100 యూనిట్లు వినియోగం దాటితే విద్యుత్తు ఛార్జీ అబ్బా...అనేలా సర్కారు వారి దెబ్బ తగలనుంది. రానున్న ఏప్రిల్ నాటి నుంచి పెంచిన ధరలు అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ మోత మోగిన నేపధ్యంలో నిత్యావసర సరుకుల ధరలతోపాటు ఆర్టీసీ ఛార్జీలు సైతం పెరిగే అవకాశాలు లేకపోలేదు. బాబు సర్కార్ తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో విద్యుత్ వినియోగదారులపై దాదాపు రూ.2 కోట్ల మేర అదనపు భారం పడనుందని ట్రాన్స్‌కో అధికారులు తేల్చిచెబుతున్నారు. కరెంటు ఛార్జీల పెంపు నిర్ణయాన్ని అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
100 యూనిట్లు దాటితే ఓంకారమే!
ఊహించినట్టే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విద్యుత్‌షాక్‌ను మిగిల్చింది. ఒక్కో వినియోగదారుడి బిల్లుపై సుమారు రూ.5.6 శాతం పెంచేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 100 యూనిట్లు పైబడి వాడితే గతంలో యూనిట్‌కు రూ. 3.60 ఉంటే ప్రస్తుతం మారిన టారిఫ్ ప్రకారం రూ. 3.82 భారం పడనుంది.
ఇది 150లోపు యూనిట్లకే. ఇక తర్వాత పెరిగే కొద్దీ భారం కూడా భారీగా పెరుగుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన ఆరేళ్లపాలనలో ఏనాడూ ఒక్కపైసా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎనిమిది నెలల పాలనలోనే జనం జేబుకు చిల్లులు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 100 యూనిట్లలోపు గృహ వినియోగదారుల పట్ల కనికరం చూపించామని చెప్పుకుంటున్న ప్రభుత్వం 100 యూనిట్లు దాటిన వారికి దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చింది.
జిల్లాపై రూ. 3 కోట్ల అదనపు భారం
జిల్లాలో గృహ, వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించి 8,94,445 సర్వీసులు ఉన్నాయి. వీటిపై పెంచిన విద్యుత్ ఛార్జీల లెక్క ప్రకారం దాదాపు రూ. 2 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఇది చాలదన్నట్లు పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ పేరుతో ప్రభుత్వం మరోమారు వాహనదారులపై భారం వేసింది.
జిల్లాలో రోజుకు 1.50 లక్షల లీటర్ల పెట్రోలు, 20 లక్షల లీటర్ల మేర డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. లీటరు పెట్రోలు, డీజిల్‌పై రూ. 4 వడ్డన పడిన నేపధ్యంలో దాదాపు రూ. కోటి మేర వాహనదారులపై అదనపు భారం పడనుంది. ఇలా ప్రతిసారి అటు కేంద్రమో, ఇటు రాష్ట్రమో దెబ్బమీద దెబ్బ కొడుతూ సామాన్యుడిని కోలుకోనీయకుండా చేస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌పై చాలాసార్లు కేవలం రూ.1-2 వరకు మాత్రమే తగ్గించిన కేంద్ర ప్రభుత్వం పెంచే సమయంలో ఏకంగా రూ. 4 పెంచుతూ నిర్ణయించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పైగా దీని ప్రభావం నిత్యావసర సరుకులతోపాటు ఆర్టీసీ ఛార్జీలపై కూడా పడనుంది.
చంద్రబాబు నిజ స్వరూపం ఇదే!
కాకులను కొట్టడం...గద్దలకు వేయడం.. బడా పెట్టుబడి దారులకు లక్షల కోట్ల రాయితీలు ఇవ్వడం...పేదలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం చంద్రబాబుకు అలవాటే! దొంగగా విద్యుత్‌ను వాడుకుంటున్న వారితోపాటు పారిశ్రామికవేత్తలు ఎగరగొట్టిన డబ్బులు వెలికితీస్తే ప్రజలపై విద్యుత్ భారం పడదు. అసలు, కొసరు పెరుతో ప్రజలపై భారం మోపడమే లక్ష్యంగా టీడీపీ సర్కార్ ముందుకు పోతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలు, డీజిల్, క్రూడాయిల్ ధరలు తగ్గాయి. ఇక్కడ సరుకు రవాణా, బస్సు ఛార్జీలపై తగ్గుదల ప్రభావం లేదు.
- జి.ఈశ్వరయ్య,
సీపీఐ జిల్లా కార్యదర్శి
మరో విద్యుత్తు ఉద్యమం తప్పదు
ప్రస్తుతం కరువుతో విలవిల్లాడుతున్నారు. ఒకవైపు విభజన జరిగి, మరోవైపు కరువుతో వర్షాలు పడక అల్లాడుతున్నారు. ఈ నేపధ్యంలో కరెంటు ఛార్జీలు పెంచి చంద్రబాబు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది చేస్తాం...ఇది చేస్తామని మోసాలతో అధికారంలోకి వచ్చిన బాబు ఏమి చేయలేకపోయారు. చివరకు రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి లాంటి వాటికి పంగనామాలు పెట్టిన ఘనుడు చంద్రబాబు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అధికారంలోకి వస్తూనే రైతు కోసం తొమ్మిది గంటల కరెంటు, ఉచిత విద్యుత్ అందించి చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రజలపై భారం మోపాలని చూడటం చాలా భాదాకరం. ఇలా చేస్తే మరో విద్యుత్తు ఉద్యమం తప్పదు. ప్రజా ఉద్యమం చెలరేగకముందే ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
- ఆకేపాటి అమర్‌నాథరెడ్డి,
వైఎస్సార్ సీపీజిల్లా కన్వీనర్