దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం?
Published Thu, Oct 10 2013 4:06 AM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM
సాక్షి, కొత్తగూడెం: జిల్లా కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు తారస్థాయికి చేరుతోంది. తనపై ఘాటుగా వ్యాఖ్యలు చేసిన రాష్టమ్రంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తీరుపై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మండిపడుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా తెలంగాణ ప్రాంత అధినాయకులు మంత్రి వెనకాల ఉండి వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆమె ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాను తాను ఎంతో అభివృద్ధి చేశానని, ఇదేమి చూడకుండా విమర్శిస్తారా..అంటూ ఈపరిణామాలపై హస్తినలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అయితే రాష్ట్ర విభజనపై పీకల్లోతు సమస్యల్లో ఉన్న దిగ్విజయ్‌సింగ్ ఆమె ఫిర్యాదును పట్టించుకోరని, ఈ వ్యవహారం అంతా తెలంగాణ మంత్రులు చూసుకుంటారని, మంత్రి మాత్రం 21వ తేదీన జరిగే సభ విజయవంతంపైనే దృష్టి పెట్టారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. కాగా, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు జిల్లా కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం సృష్టించాయి. ఖమ్మం జిల్లా ఆడబిడ్డనంటూ ఇప్పటి వరకూ రేణుక ఎన్ని రాజకీయాలు నడిపినా మౌనంగా ఉన్న మంత్రి హఠాత్తుగా దాడి చేయడం వెనక పెద్ద వ్యూహమే ఉందని పార్టీశ్రేణులు చర్చించుకుంటున్నాయి. తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు వెన్నుదన్నుగా నిలవడం వల్లే తీవ్రస్థాయిలో ఆమెపై మంత్రి విరుచుకుపడ్డారని సమాచారం.
తాజా పరిణామాలపై సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, ఇతర తెలంగాణ మంత్రులు సైతం ఏమీ భయపడవద్దని మంత్రికి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. కాగా, ఈనెల 21వ తేదీన ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ కృతజ్ఞత సభకు ఎట్టి పరిస్థితుల్లోనూ రేణుకను ఆహ్వానించరాదన్న ఉద్దేశంతోనే మంత్రి ఆమెపై వ్యాఖ్యలు చేశారని పార్టీ నేతలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇలా ఉండగా...మంత్రి వ్యాఖ్యలను జిల్లాలో రేణుకాచౌదరి వర్గీయులు కొందరు ఖం డించారు. అయితే గతంలో ఆమె అనుంగులుగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ మంత్రి వ్యాఖ్యలను ఖం డించకపోగా ఆయనకు లోపాయికారిగా మద్దతు పలికినట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన ఈ వ్యవహారంలో మంత్రికే మద్దతిచ్చారు.
హుకుం జారీ చేసినా...
మంత్రి తనపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఖండించాలని రేణుక జిల్లాలోని తన ముఖ్య అనుచరులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. అయితే వారిలో కొందరు మాత్రమే ఇందుకు స్పందించారు. మిగిలిన వారు ముందుకు రాకపోవడం గమనార్హం. కాగా రాజధానిలోనే ఉన్న డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావును కూడా ఆమె ఈమేరకు ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆయన హైదారబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. రేణుక ఇచ్చిన స్క్రిప్‌టతోనే ఇటు వనమా, అటు కొందరు అనుచరులు మంత్రి చేసిన విమర్శలపై స్పందించినట్లు రాంరెడ్డి క్యాడర్ చర్చించుకుంటోంది. మొత్తంగా అదును చూసి దెబ్బతీసిన ప్రత్యర్థివర్గంపై రేణుక ప్రతీకారం తీర్చుకుంటారని, ఇందుకు ఎలాంటి వ్యూహం పన్నుతారో అనే చర్చ కూడా నడుస్తోంది.
Advertisement
Advertisement