ఆ భవనం ఎవరికి? విద్యకా.. వైద్యానికా.. | concern on three hundred-bed maternity building | Sakshi
Sakshi News home page

ఆ భవనం ఎవరికి? విద్యకా.. వైద్యానికా..

Published Sat, Nov 22 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

ఆ భవనం ఎవరికి? విద్యకా.. వైద్యానికా..

ఆ భవనం ఎవరికి? విద్యకా.. వైద్యానికా..

ఒకవైపు తిరుపతిలో మొట్టమొదటి మహిళా వైద్య కళాశాల.. మరో వైపు వేలాది మంది పేదలు వచ్చే మెటర్నిటీ ఆస్పత్రి.. ఇటు కళాశాల నిర్వహణకు సరైన భవనం లేదు.. అటు గర్భవతులు, బాలింతలు పడుకునేందుకు బెడ్లు లేవు.. ఈ నేపథ్యంలో మెటర్నిటీ ఆస్పత్రి కోసం నిర్మిస్తున్న 300 పడకల భవనంపై స్విమ్స్ మెడికల్ కళాశాల కన్నుపడింది. దీనికోసం రెండు సంస్థలూ పోరాడుతున్నాయి. చివరికి ఈ భవనం ఎవరికి దక్కుతుందో..
 
తిరుపతి కార్పొరేషన్: రాయలసీమకే తలమానికంగా ఏర్పాటు చేస్తున్న మూడు వందల పడకల మెటర్నిటీ భవన నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. అయితే ఈ భవనాన్ని ఎవరికి కేటాయించాలన్నది వివాదాస్పదంగా మారుతోంది. ప్రస్తుతం మెటర్నిటీ ఆస్పత్రికి అనుబంధంగా రూ.72 కోట్లతో 300 పడకలతో అత్యాధునిక వసతులతో భవన నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ భవనాన్ని స్విమ్స్‌కు కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. దీనికి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ ఉన్నతాధికారి తీవ్రంగా కృషి చేస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు బహిరంగంగా ఆరోపిస్తున్నాయి. అయితే ఆ నూతన భవనం తమకే కేటాయించాలని ఎస్వీ మెడికల్ కళాశాల (మెటర్నిటీ ఆస్పత్రి) అధికారులు పట్టుబడుతున్నారు.

దీనికి తోడు సంబంధిత మంత్రి తిరుపతికి వచ్చిన ప్రతిసారీ నూతన భవనం కేటాయింపుపై పొంతనలేని ప్రకటనలు చేస్తుండడంతో గందరగోళానికి వేదికగా మారింది. ఇటీవల తిరుపతికి వచ్చిన వైద్య విద్యా ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసులు ఈ భవనాన్ని స్విమ్స్‌కు ఇస్తున్నట్టు వైద్యాధికారులతో చెప్పారు. పైగా మొదటి సారి శ్రీపద్మావతి మెడికల్ కళాశాల తిరుపతికి వచ్చిందని, అందులో వైద్య విద్యను అభ్యసించేందుకు ఈ భవనాన్ని తాత్కాలిక పద్ధతిలో కేటాయిస్తున్నామని, మీరు సహకరించాలని కోరారు.

ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి వ్యతిరేకిస్తూ, అలాంటి ప్రయత్నంచేస్తే ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోవలసి వస్తుందని మంత్రికి చెప్పారు. అయినా సరే స్విమ్స్‌కు అనుబంధంగా ఉన్న శ్రీపద్మావతి మెడికల్ కళాశాల విద్యార్థులకు భవ నం కేటాయించేందుకు చకచకా ఏర్పా ట్లు పూర్తవుతున్నాయి. ఈ ప్రతిపాదనను సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

సౌకర్యాల లేమితో ఇబ్బందులు...
ప్రస్తుతం ఉన్న మెటర్నిటీ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది అలుపెరగకుండా విధులు నిర్వహిస్తున్నా సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన రోగులకు తగ్గట్టుగా వైద్య సౌకర్యాలు పెరగకపోవడంతో ప్రసవానికి వస్తున్న గర్భిణులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. మెటర్నిటీలో 150 బెడ్లు ఉన్నాయి. గతంలో రోజుకు 30 నుంచి 35 ప్రసవాలు జరుగుతుండగా, అందుకు తగ్గట్టుగానే పీఎన్ వార్డులో 40 బెడ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రసవాల సంఖ్య 50 నుంచి 60కి పెరగడంతో బెడ్ల కొరత పీడిస్తోంది. ఈనెల 7న ఓకే రోజు రికార్డు స్థాయిలో 66 ప్రసవాలు జరిగాయి. దీంతో ఉన్న 40 బెడ్లలో వీరిని పడుకోబెట్టడం కష్టంగా మారింది. ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు చొప్పున ఉండాల్సి వచ్చింది. పిల్లలను పక్కలో పడుకోబెట్టుకునేందుకు స్థలం లేకపోవడంతో నేల పైన పడుకోబెట్టాల్సి వస్తోంది.

నూతన భవనం కేటాయిస్తే మెరుగైన సేవలు
ఈ సమస్య పరిష్కారం కోసం మెట ర్నిటీ సమీపంలోనే మూడు వందల పడకలతో అధునాతన సౌకర్యాలతో భవన నిర్మాణం ప్రారంభించారు. మొత్తం 72 కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఆస్పత్రి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటి వరకు మొదటి దశలో కేవలం 80 బెడ్లతో కూడిన విభాగం మాత్రమే సిద్ధమైంది. రెండవ దశలో 37.5 కోట్లతో ప్రతిపాదనలు పంపిం చామని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.

పనులు త్వరగా పూర్తయితే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని, తమ కల నెరవేరుతుందని వైద్యులు అంటున్నారు. దీనికి తోడు గర్భిణులు సైతం వెయ్యి కళ్లతో నూతన ఆస్పత్రి భవనం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ భవనాన్ని ఎవరికి కేటాయిస్తుందో ఇంతవరకు తేల్చలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement