అసాధారణ సెలవు నిబంధనలు ఇలా.. | Conditions for Unusual holiday | Sakshi
Sakshi News home page

అసాధారణ సెలవు నిబంధనలు ఇలా..

Published Thu, Mar 1 2018 10:59 AM | Last Updated on Thu, Mar 1 2018 10:59 AM

Conditions for Unusual holiday - Sakshi

పశ్చిమగోదావరి, నిడమర్రు : ఆంధ్రప్రదేశ్‌ సెలవు నిబంధనలు–1933 ప్రకారం సర్వ సాధారణంగా ఉద్యోగులకు ఏ విధమైన ఆర్జిత సెలవు గాని అర్థవేతన సెలవు గానీ లేనిపక్షంలో అసాధారణ సెలవు కోసం అభ్యర్థిస్తారు. అసాధారణ సెలవు(ఎక్సాట్రార్డినరీ లీవ్‌) మరో విధంగా జీతం లేని సెలవు(లీవ్‌ ఆన్‌ లాస్‌ఆఫ్‌ పే)గా పరిగణిస్తారు. అంటే ఏ ఇతర సెలవు ఉద్యోగికి అర్హత లేనప్పుడు అసాధారణ సెలవు మంజూరు చేయవచ్చు. ఈ అసాధారణ సెలవు నిబంధనలు తెలుసుకుందాం.

ఇతర సెలవులు ఉన్నప్పుడు కూడా..
ఉద్యోగి లిఖితపూర్వక అభ్యర్థన మేరకు ఆర్జిత సెలవు, అర్థజీతపు సెలవు సదరు ఉద్యోగి ఖాతాలో నిల్వ ఉన్నప్పటికీ అసాధారణ సెలవు మంజూరు చేయవచ్చు. అసాధారణ సేవల కాలానికి ఎలాంటి జీతభత్యాలు రావు.

అసాధారణ సెలవు–ఇంక్రిమెంట్లు
ప్రభుత్వ ఉద్యోగి తన శక్తికి మించి అసహాయ పరిస్థితుల్లో రోగ పీడితుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో సంతృప్తి చెందిన పక్షంలో గాని, లేక పై చదువులకు గాని, సాంకేతికపరమైన చదువులకు గాని అసాధారణ సెలవు మంజూరు చేసిన యెడల, అట్టి అసాధారణ సెలవు ఇంక్రిమెంట్లు మంజూరు చేయుటకు పరిగణనలోకి తీసుకుంటారు.  
సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగి సస్పెన్షన్‌ కాలాన్ని అసాధారణ సెలవుగా పరిగణించినపుడు అట్టి కాలాన్ని వార్షిక ఇంక్రిమెంటుకు పరిగణించుటకు వీలు లేదు.
ఉద్యోగి మెడికల్‌ ధ్రువీకరణ పత్రం ఆధారంగా అసాధారణ సెలవుపై వెళ్లిన సందర్భాలలో సంబంధిత శాఖాధిపతి అట్టి సెలవు కాలాన్ని 6 నెలలకు మించకుండా వార్షిక ఇంక్రిమెంటు కోసం కలుపుకొనుటకు అనుమతించవచ్చు. అంతకు మించిన కాలానికి ప్రభుత్వ అనుమతి కావాలి.
2002 జీవో ప్రకారం ఉద్యోగి ప్రత్యేకంగా శాఖాధిపతికి అభ్యర్థన పత్రం సమర్పించనవసరం లేదు. శాఖధిపతి బా«ధ్యత వహించి అవసరమైన చోట ప్రభుత్వ అనుమతి పొంది, అసాధారణ కాలాన్ని ఇంక్రిమెంట్‌కు కలిపి వార్షిక ఇంక్రిమెంటులను విడుదల చేయాలి. అట్టి వివరాలు సర్వీస్‌ రిజిస్టర్‌లో నమోదు చేయాలి.
ఈ సెలవుకు మెడికల్‌ సర్టిఫికెట్లు
అసాధారణ సెలవు మెడికల్‌ ధ్రువీకరణ పత్రం ఆధారంగా పొందుటకు, గెజిటెడ్‌ అధికారులైతే సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ నుంచి, ఎన్‌జీవోలు, నాలుగో తరగతి ఉద్యోగులైతే రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ నుంచి మెడికల్‌ సర్టిఫికెట్‌ పొందవచ్చు.

ముఖ్య నిబంధనలు..
ఏ ఉద్యోగి కూడా మొత్తం సర్వీసులో ఇలాంటి సెలవులపై ఐదేళ్లు మించి వెళ్లకూడదు. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వ అనుమతిపై ఐదేళ్లు మించి వెళ్లవచ్చు.అసాధారణ సెలవు పరిమితులు
సాధారణంగా 3 నెలల వరకూ తీసుకోవచ్చు. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసినవారు మెడికల్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా 6 నెలలు వరకు ప్రభుత్వ అనుమతితో సెలవు తీసుకోవచ్చు.
ఏడాది సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగి క్షయ లేదా కుష్టు వ్యాధికి గురై, ఆస్పత్రులలో చేరినా లేదా ఔట్‌ పేషెంట్‌గా చికిత్స పొందుతున్న సందర్భంలో సంబంధిత మెడికల్‌ ఆఫీసర్‌ జారీ చేసిన సర్టిఫికెట్‌ ఆధారంగా 18 నెలల వరకు ప్రభుత్వ అనుమతితో సెలవు మంజూరవుతుంది.
క్యాన్సర్, మానసిక వ్యాధులకు గురైన ఉద్యోగులు గుర్తింపు పొందిన వైద్య సంస్థ గాని లేక డాక్టరు జారీచేసిన మెడికల్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా 12 నెలల వరకు ప్రభుత్వ అనుమతితో సెలవు ఇస్తారు.
అసాధారణ సెలవు ఇతర సెలవులతో కలపి తీసుకొనవచ్చు.
ఉద్యోగులు విదేశాల్లో ఉద్యోగం చేయుటకు కొన్ని షరతులకు లోబడి ఐదేళ్ల వరకు అసాధారణ సెలవు పొందవచ్చు.
ఉద్యోగులు ఏ క్యాటగిరీకి చెందినవారైనప్పటికీ సాంకేతిక నిపుణులు, సాంకేతిక నిపుణులు గాని, లేక గుమస్తాలు గాని విదేశాల్లో ఉద్యోగం పొందుటకు దరఖాస్తు చేసుకుని వెళ్లుటకు అవకాశం కల్పించారు.
కాని విదేశాలలో ఉద్యోగం అన్వేషించుటకు అసాధారణ సెలవు మంజూరు చేయకూడదు.
ఉద్యోగ నియామక ఉత్తర్వులు పొందిన తర్వాత ఉద్యోగం చేయుటకు మాత్రమే సెలవు మంజూరు చేయవచ్చు.
అసాధారణ సెలవు ఇంక్రిమెంట్‌కు, జీతభత్యాలకు, సెలవు తదితరాలకు పరిగణించబడదు.
ఉద్యోగి ప్రభుత్వానికి ఏ విధమైన బాకీలు ఉండకూడదు. ఉద్యోగిపై ఏవిధమైన  కేసులు న్యాయస్థానాలలో పెండింగ్‌లో ఉండకూడదు.
ఇట్టి అసాధారణ సెలవు పూర్తికాల సర్వీసులో ఒక్కసారి మాత్రమే ఇస్తారు.
విదేశాల్లో పనిచేయుటకు ఐదేళ్లలో, ఒక్కసారి గాని లేక విడతల వారీగా గాని అసాధారణ సెలవు మంజూరు చేయవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement