నిర్ణయం మారదు!
* అక్టోబర్ మొదటి వారంలో కేబినెట్ నోట్
* కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ వెల్లడి
* సీడబ్ల్యూసీ నిర్ణయంపై కాంగ్రెస్ వెనక్కి వెళ్లదని పునరుద్ఘాటన
* ఆంటోనీ కమిటీ పరిశీలనలు తెలంగాణ నోట్‌లో చేర్చరు.. బిల్లులో చేరుస్తారని స్పష్టీకరణ
* రాష్ట్ర విభజన జరిగే వరకూ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లోనూ మారదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పునరుద్ఘాటించారు. తెలంగాణపై హోం శాఖ రూపొందిస్తున్న కేబినెట్ నోట్ వచ్చే నెల మొదటి వారంలో జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశం ముందుకొచ్చే అవకాశాలున్నాయని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొన్న నిర్ణయాలను ప్రాంతీయ పార్టీల మాదిరిగా తరచుగా మార్చుకోదని స్పష్టం చేశారు. ఆయన గురువారంనాడిక్కడ తనను కలిసిన విలేకరులతో చెప్పారు.
సుదీర్ఘ కాలం సాగిన విస్తృతస్థాయి సంప్రదింపుల అనంతరమే, అత్యధిక రాజకీయ పార్టీల అభిమతానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకొందని వెల్లడించారు. నిర్ణయం వెలువడిన తర్వాత కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ అభిప్రాయాలను మార్చుకొన్నంత సులువుగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మార్చుకోవడం సాధ్యపడదని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోగానే మంత్రివర్గ తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ పరిశీలనకు పంపుతామని దిగ్విజయ్‌సింగ్ స్పష్టంచేశారు. సీమాంధ్రులు ప్రస్తావిస్తున్న హైదరాబాద్ నగరం, నదీజలాల పంపిణీ వంటి కీలక అంశాలపై ఆంటోనీ కమిటీ చేయనున్న సిఫార్సుల ఆధారంగానే పార్లమెంట్ ఆమోదానికి సమర్పించనున్న తెలంగాణ బిల్లు రూపొందుతుందని ఆయన వెల్లడించారు.
ఆంటోనీ కమిటీ నివేదిక వెలువడడానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రతిపాదిస్తూ హోం శాఖ కేంద్ర మంత్రివర్గానికి సమర్పించనున్న కేబినెట్ నోట్‌కు ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రివర్గ నిర్ణయానంతరం తెలంగాణ బిల్లును సిద్ధం చేసే దశలోనే ప్రభుత్వం ఆంటోనీ కమిటీతో చర్చలు జరుపవచ్చునన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే పార్టీలు, ప్రభుత్వాల నిర్ణయాలు ఉండి తీరాలంటూ తాను రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నానన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించేందుకు దిగ్విజయ్‌నిరాకరించారు. అయితే, రాజకీయ పార్టీల వైఖరులు, విధానాల కంటే ప్రజాభిప్రాయమే గొప్పదన్న ఆయన అభిప్రాయంలో తప్పేమీ లేదన్నారు.
ముఖ్యమంత్రి ఎప్పుడు, ఎలాంటి వ్యాఖ్యలు చేశారన్న పూర్తి సమాచారం తెలిసిన తర్వాతే ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తానని విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఆఖరి బంతి వరకు ఆట ముగియదన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను గుర్తుచేయగా, ఆ వ్యాఖ్య లలిత్‌మోడీది అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు. అధిష్టానాన్ని ధిక్కరించే ధోరణిలో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రిని మార్చే ఆలోచన ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. రాష్ట్ర విభజన జరిగేంతవరకూ కిరణ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. అయితే, ఆయన ఏ ఒక్క ప్రాంతానికో కాకుండా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు.
హోంమంత్రి షిండేతో చర్చలు
అంతకుముందు, దిగ్విజయ్‌సింగ్ నార్‌తబ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయానికి వెళ్లి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలిసి తెలంగాణపై కేబినెట్ నోట్ గురించి చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది. ఆంటోనీ కమిటీ సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యేవరకూ కేబినెట్ నోట్‌తో ప్రభుత్వం ముందుకు వెళ్లరాదంటూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో దిగ్విజయ్ హోం మంత్రితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. హోం మంత్రితో చర్చల అనంతరమే హైదరాబాద్ నగర ప్రతిపత్తి, నదీజలాల పంపిణీ వంటి కీలకాంశాలపై తెలంగాణ బిల్లును రూపొం దించే సమయంలో మాత్రమే ఆంటోనీ కమిటీతో ప్రభుత్వం సంప్రదిస్తుందని ఆయన ప్రకటించడం గమనార్హం.
సోనియాతో పల్లంరాజు భేటీ
ఇదిలా ఉండగా, సీమాంధ్రకు చెందిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎం.ఎం.పల్లంరాజు గురువారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకొని తెలంగాణ నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను, దాదాపు రెండు మాసాలుగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రతను వివరించినట్లు తెలియవచ్చింది. ఆంటోనీ కమిటీ నివేదిక రాకుండా, విభజనతో తలెత్తే సమస్యలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలు కనుగొనకుండా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో ముందుకెళ్లరాదని ఆయన సోనియాకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
విభజనను అడ్డుకునేందుకు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని ప్రకటించిన సీమాంధ్ర నేతలు చివరి ప్రయత్నంగా పార్టీ అధ్యక్షురాలిని, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకొనేందుకు వారం రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ అపాయింట్‌మెంట్ దొరకలేదు. పళ్లంరాజుకు మాత్రమే సోనియా అపాయింట్‌మెంట్ దొరకడం గమనార్హం. సోనియాతో భేటీకి ముందు, పల్లంరాజు, మరో కేంద్ర మంత్రి జె.డి.శీలంతో పాటు దిగ్విజయ్‌ని కలసి చర్చించారు.