తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు దీన్ని కేంద్ర మంత్రులకు పంపిణీ చేస్తారని తెలుస్తోంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పిన మాటలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. వాస్తవానికి బుధవారం రాత్రే నోట్ సిద్ధమైందని సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని, సీమాంధ్రకు రాజధానిగా ఏ నగరం ఉండాలన్న అంశాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి వదిలేస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయంటూ నేషనల్ మీడియా పేర్కొంది. ఇవాళ్టి సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో తెలంగాణపై నోట్‌ను ఆమోదిస్తారని సమాచారం.
ఈ సమావేశంలో తెలంగాణ నోట్‌పై చర్చించడంతో పాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు మంత్రుల బృందాన్ని నియమిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నదీ జలాలు, ఇతర సమస్యలను మంత్రుల బృందం పరిశీలిస్తుందని ఆ వర్గాలు వివరించాయి. ఇందుకు సంబంధించి కేంద్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయని నేషనల్ మీడియా విశ్లేషిస్తోంది.
కేబినెట్‌లో ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపిస్తారని, ఆ తర్వాత వారం, పది రోజుల్లో అసెంబ్లీకి పంపించే దిశగా కసరత్తు సాగుతోందని నేషనల్ ఛానెల్లు పేర్కొంటున్నాయి. తెలంగాణ అంశానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియా కథనాలకు బలం చేకూరుస్తున్నాయి.
తెలంగాణ నోట్ సిద్ధం.. మధ్యాహ్నమే మంత్రుల చేతికి!
Published Thu, Oct 3 2013 12:46 PM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM
Advertisement