
18న వైఎస్సార్ సిపిలో చేరుతున్నా: విశ్వరూప్
హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణకు దీక్షకు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ సంఘీభావం తెలిపారు. దీక్షా స్థలి వద్ద జగన్ను కలిసి మద్దతు ప్రకటించారు. జగన్ ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. సమైక్యాంధ్ర కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన విశ్వరూప్.. జగన్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా, ఈ నెల 18న వైఎస్సార్ సీపీలో చేరనున్నట్టు విశ్వరూప్ తెలిపారు. సమైక్యాంధ్ర కోసం జగన్ ఒక్కరే దీక్ష చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ విభజనకే మొగ్గు చూపుతోందని, దీన్ని సీఎం కిరణ్ అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖా మంత్రి పదవికి విశ్వరూప్ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సమైక్యాంధ్ర ఉద్యమ నేతల నుంచి రాజీనామాకు ఒత్తిడి పెరగడం, విభజనకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపడంతో ఆయన మంత్రి పదవిని వదులుకున్నారు. రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రిగా ఉండి విభజనను అడ్డుకునే పరిస్థితి లేకపోవడంతో.. నిజాయితీగా రాజీనామా చేసి ఆమోదింప చేసుకున్నారు.