ఓట్లు, సీట్ల ప్రాతిపదికన రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజించే ప్రయత్నం ఢిల్లీలో జరుగుతోందని, దీన్ని అడ్డుకోకుంటే ఇరుప్రాంత ప్రజల మధ్య విద్వేషాలు పెరిగి రాష్ట్రం రావణకాష్టంలా మారే ప్రమాదం ఉందని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ హెచ్చరించారు.
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : ఓట్లు, సీట్ల ప్రాతిపదికన రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజించే ప్రయత్నం ఢిల్లీలో జరుగుతోందని, దీన్ని అడ్డుకోకుంటే ఇరుప్రాంత ప్రజల మధ్య విద్వేషాలు పెరిగి రాష్ట్రం రావణకాష్టంలా మారే ప్రమాదం ఉందని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ హెచ్చరించారు. ఆచార్య ఎన్‌జీ రంగా 114వ జయంతి సభలో పాల్గొనేందుకు గురువారం ఆయన ఒంగోలు వచ్చారు.
స్థానిక ఎన్నెస్పీ గెస్టు హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశం కంటే పార్టీ ముఖ్యం, పార్టీ కంటే వ్యక్తి ముఖ్యం.. అనే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అవలంబిస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజల గుండెలపై తన్నుతూ ఓట్లు, సీట్ల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. మూడు ప్రాంతాల ప్రజల అంగీకారం తీసుకోవాల్సిన అవసరం ఉందని, అసెంబ్లీ ఆమోదం లేకుండా ఏ రాష్ట్రం ఏర్పాటు కాలేదని వివరించారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వడమే తెలుగు ప్రజలకు శాపంగా మారిందని విచారం వ్యక్తం చేశారు. తమిళనాడులో కరుణానిధి వంటి నాయకులు నేడు ప్రధాన మంత్రిని శాసించే స్థాయికి ఎదిగితే కనీసం రాష్ట్రాన్ని కాపాడుకునే స్థితిలో మన నాయకులు లేరన్నారు.
ఎంతకైనా తెగించే పార్టీ కాంగ్రెస్
తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టేందుకైనా కాంగ్రెస్ పార్టీ వెనుకాడదని జేపీ దుయ్యబట్టారు. గతంలో పంజాబ్ రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలతో అక్కడ జరిగిన విధ్వంసాన్ని గుర్తు చేశారు. అప్పట్లో జరిగిన మారణకాండలో 1700 మంది సైనికులు మరణించారని చెప్పారు. ఈ విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియకుండా తొక్కిపెట్టారన్నారు. జమ్ము కాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానంతో అప్పుడు ఆ రెండు రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలే ఇక్కడా పునరావృత్తమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజిస్తే దేశ సమగ్రతకు ముప్పు వచ్చే అవకాశం ఉందని అన్నారు.