పొత్తుపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్ చర్చలు! | Congress, TDP discussions continued on Party tie up | Sakshi
Sakshi News home page

పొత్తుపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్ చర్చలు!

Published Thu, Mar 6 2014 2:55 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

పొత్తుపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్ చర్చలు! - Sakshi

పొత్తుపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్ చర్చలు!

కేకేతో దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్ మంతనాలు
 సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో విలీనమయ్యే ప్రసక్తే లేదని టీఆర్‌ఎస్ తేల్చిచెప్పిన నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తులపై చర్చలు ప్రారంభమయ్యూయి. ఏఐసీసీ నేతలు దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్.. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావులు ఈ చర్చలు సాగిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలున్న కేకేతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, అందువల్ల టీఆర్‌ఎస్‌పై విమర్శలకు తొందరపడొద్దని కాంగ్రెస్ తెలంగాణ నేతలకు సూచనలు అందినట్టు తెలిసింది.
 
  కాంగ్రెస్‌తో విలీనం ఉండదని ప్రకటించినప్పటికీ పొత్తుకు సిద్ధమేననే సంకేతాలను టీఆర్‌ఎస్ అధిష్టానం పంపడంతో.. పొత్తులపై సూత్రప్రాయమైన నిర్ణయానికి వచ్చే దిశగా దిగ్విజయ్ చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. చర్చల నేపథ్యంలోనే తెలంగాణలోని ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశాలున్నాయి? ఏ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది? అనే వివరాలపై ఇరుపార్టీలు దృష్టి పెట్టారుు. కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవాలంటే ఎంపీ సీట్లే కీలకమైనందున టీఆర్‌ఎస్‌తో పొత్తు కుదిరితే తాము ఎక్కువగా ఎంపీ సీట్లే కోరే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు ఎమ్మెల్యే స్థానాలను టీఆర్‌ఎస్‌కు ఎక్కువగా ఇచ్చేందుకు పార్టీ పెద్దలు సుముఖంగా ఉన్నట్టు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ లక్ష్య సాధన పూర్తయినందున టీఆర్‌ఎస్ ముందున్న ప్రధాన కర్తవ్యం తెలంగాణ పునర్నిర్మాణమే. అది జరగాలంటే రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాల్సిన అవసరముందని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణలో మెజారిటీ స్థానాలు టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటే ఇతర పార్టీల మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. పొత్తులో భాగంగా 70కి పైగా అసెంబ్లీ స్థానాలు టీఆర్‌ఎస్‌కు దక్కేలా చూడాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ ఉద్దేశంతోనే అవసరమైతే 17 ఎంపీ సీట్లలో 10 స్థానాలను తీసుకున్నా అభ్యంతరం లేదనే సంకేతాలను కాంగ్రెస్‌కు పంపినట్లు సమాచారం. ఇరు పార్టీల పెద్దల మధ్య సీట్ల సర్దుబాటుపై అంతర్గత చర్చలు జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.
 
 ఎందుకీ వెంపర్లాట!: కాంగ్రెస్‌లో విలీనమయ్యే ప్రసక్తే లేదని టీఆర్‌ఎస్ తేల్చిచెప్పిన తర్వాత కూడా ఆ పార్టీతో పొత్తు కోసం హైకమాండ్ పెద్దలు తహతహలాడుతుండటాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్సేనన్న విషయం ప్రజల్లోకి వెళ్లిపోయిందని, టీఆర్‌ఎస్‌తో పొత్తు లేకపోయినా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పినా హైకమాండ్ పెద్దలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కేసీఆర్ కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నా ప్రతి విమర్శలు చేయలేని పరిస్థితిపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జానారెడ్డి నివాసంలో మంగళవారం సమావేశమైన టీ కాంగ్రెస్ నేతలు ఆ తర్వాత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఈ విషయం హైకమాండ్ దృష్టికి వెళ్లింది. బుధవారం తెలంగాణ నేతలతో ఫోన్‌లో మాట్లాడిన దిగ్విజయ్.. ప్రస్తుతానికి టీఆర్‌ఎస్‌ను విమర్శించొద్దని సూచించారు.
 
 ఒకరిద్దరు కీలకమైన నేతలకు టీఆర్‌ఎస్‌తో పొత్తుకు హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, ఇప్పటికే అంతర్గతంగా మంతనాలు జరుగుతున్నాయని కూడా చెప్పినట్లు తెలిసింది. అరుుతే టీ కాంగ్రెస్ నేతల్లో అత్యధికులు ఇప్పటికీ టీఆర్‌ఎస్‌తో పొత్తు వద్దని, ఒంటరిగానే పోటీ చేయాలని హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. పొత్తువల్ల సీట్లు కోల్పోయే నాయకులు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశాలున్నాయని, తద్వారా అసలుకే ఎసరొచ్చే ప్రమాదముందని ఒక నేత ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా టీఆర్‌ఎస్‌తో పొత్తువల్ల తమకు మళ్లీ సీట్లు దక్కుతాయో లేదోననే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇబ్బందిలేని రీతిలో ఇరు పార్టీలు పొత్తులు పెట్టుకునే దిశగా చర్చలు జరుపుతున్నందున ఆందోళన అవసరం లేదని హైకమాండ్ పెద్దలు చెబుతున్నట్లు తెలిసింది.
 
 పొత్తులపై చర్చల్లేవు : కేకే
 పొత్తులపై కాంగ్రెస్‌తో చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారాన్ని టీఆర్‌ఎస్ నేత కె.కేశవరావు ఒక ప్రకటనలో ఖండించారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement