సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా సాగుతున్న క్రమంలో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లా రాజకీయాలు మారుతున్నాయి. 2014 సాధారణ ఎన్నికల నాటికి అనేక మార్పులు సంభవించే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్ర విభజన అనంతరం ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందా? లేదా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పొత్తులు ఉంటాయా? అన్న చర్చ జోరందుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన టీఆర్‌ఎస్ సమావేశంలో విలీనమా? పొత్తులా? అన్న అంశంపై సరైన సమయంలో స్పందిస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది. పదమూడేళ్లుగా ఉద్యమాన్ని నడుపుతున్న పార్టీని కాంగ్రెస్‌లో ఎందుకు విలీనం చేయాలి? అంటూ ప్రశ్నిస్తూనే విలీనంపై సరైన సమయంలో స్పందిస్తామనడం ఆ పార్టీ శాసనసభ్యుల్లో చర్చకు దారి తీసింది.
కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతల్లో చర్చ
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం తొందర పడుతుండటంతో ఆ తర్వాత 2014లో జరిగే సాధారణ ఎన్నికలు చాలా మందికి కీలకం కానున్నాయి. వచ్చే ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు నాయకులు ఆతృతతో ఉండగా, ఇటీవలి రాజకీయ పరిణామాలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వర్గాలను గందరగోళంలో పడేశాయి. జిల్లాలో రెండు పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఆదిలాబాద్ ఎంపీగా టీడీపీకి చెందిన రాథోడ్ రమేశ్ ఉండగా, పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన డాక్టర్ జి.వివేక్ టీఆర్‌ఎస్‌లో చే రారు. 10 అసెంబ్లీ స్థానాల్లో ఐదు నియోకవర్గాల్లో టీఆర్‌ఎస్, రెండు చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల టీడీపీ, ఒకచోట సీపీఐ పార్టీలకు చెందిన శాసనసభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
2009 ఎన్నికల్లో మంచిర్యాల, సిర్పూరు(టి), చెన్నూరు నియోజకవర్గాల్లో గడ్డం అరవిందరెడ్డి, కావేటి సమ్మయ్య, నల్లాల ఓదేలు టీఆర్‌ఎస్ నుంచి గెలుపొందారు. ఆదిలాబాద్, ముథోల్‌ల నుంచి టీడీపీ అభ్యర్థులుగా గెలుపొందిన జోగు రామన్న, సముద్రాల వేణుగోపాలాచారి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో రామన్న టీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీ చేసి గెలుపొందగా, ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. నిర్మల్ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచిన మహేశ్వర్‌రెడ్డి విలీనంలో భాగంగా కాంగ్రెస్‌లో చేరారు. దీంతో 2009లో ఎన్నికల్లో ఆయా పార్టీలు సాధించిన బలాబలాలు తారుమారయ్యాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య మూడు నుంచి ఐదుకు పెరగగా, టీడీపీ నాలుగు నుంచి రెండుకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఒకటి నుంచి రెండుకు చేరాయి. అయితే రాష్ట్ర విభజన జరిగి కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం అయినా, లేక పొత్తులతో బరిలో దిగిన పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆ రెండు పార్టీల నాయకుల్లో చర్చనీయాంశమైంది.
‘గులాబీ దండు’లో మొదలైన సమీక్ష
పదమూడేళ్ల సుదీర్ఘ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ర్టం ఏర్పడబోతుంది. ఈ క్రమంలో రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. రాజకీయ పార్టీలు తెలంగాణ నినాదం చుట్టూ తిరిగాయి. సీపీఎం మినహా అన్ని పార్టీలు తెలంగాణ అంశాన్ని జపించాయి. ఈ నేపథ్యంలో 2014లో జరిగే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయనేది రాజకీయ పార్టీల నేతల మధ్య తాజా చర్చ. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ జిల్లాలో నిరంతర ఉద్యమాలతో దూసుకెళ్లింది. 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో పొత్తులు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది.
ఆ తర్వాత పార్టీని బలోపేతం చేసే క్రమంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చే నేతలను ఆహ్వానం పలికింది. దీంతో జిల్లాలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల సంఖ్య ఐదుకు చేరింది. భవిష్యత్‌లో కాంగ్రెస్‌లో విలీనం అయినా.. లేక కాంగ్రెస్ పార్టీతో జతకట్టినా.. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఎవరికి దక్కుతుందనే చర్చ జరుగుతోంది. విలీనమైతే... జిల్లాలో ఎన్ని స్థానాలు ఇస్తారు? ఒకవేళ పొత్తులతో ముందుకెళ్తే ‘సిట్టింగ్’లకు అవకాశం ఉంటుందా? లేదా? అన్న అంశాలపై సంశయాలే. టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఐదు చోట్ల అవకాశం కల్పిస్తే.. మిగతా ఐదు స్థానాలకే కాంగ్రెస్ పరిమితం అవుతుందా? లేదు?... ఆ పార్టీ నేతలు జిల్లాలో ఎలాంటి ప్రతిపాదనలు చేస్తారు? అన్న అంశాలపై కూడా టీఆర్‌ఎస్ శ్రేణులు సమీక్షల్లో పడ్డాయి. రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారుతున్న తరుణంలో 2014 ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా మారనున్నాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల విలీనం, పొత్తుల వ్యవహారం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశం కాగా ఆశావహులు ఇప్పటి నుంచే అధిష్టానాలపై భారం పెడుతున్నారు.
పొత్తా? విలీనమా?
Published Sat, Oct 26 2013 4:32 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement