
మంత్రి గంటాకు షోకాజ్ ఇవ్వనున్న కాంగ్రెస్?
మంత్రి గంటా శ్రీనివాసరావుకు షోకాజ్ నోటీసు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్: మంత్రి గంటా శ్రీనివాసరావుకు షోకాజ్ నోటీసు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ హైకమాండ్‌కు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యల రికార్డ్‌ను సేకరిస్తున్నట్టు సమాచారం. రాష్ట విభజనను వ్యతిరేకిస్తూ పలు సందర్భాల్లో ఆయన అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడారు. పార్టీని వీడేందుకు కూడా వెనుకాడబోనని చెప్పారు. ఆయన టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. సోనియాపై వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి ఇప్పటికే షోకాజ్ నోటీసు ఇచ్చారు.
కాగా, కేంద్ర మంత్రి చిరంజీవితో నేడు పీఆర్పీ నేతలు సమావేశమయ్యారు. మంత్రి గంటా కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే గంటాకు షోకాజ్ నోటీసు ఇవ్వనున్నట్టు వార్తలు రావడం గమనార్హం. తాజా రాజకీయ పరిణామాలపై చిరంజీవితో చర్చించామని భేటీ తర్వాత మంత్రి గంటా తెలిపారు. సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. భవిష్యత్ కార్యాచరణపై మరోసారి భేటీ అవుతామని చెప్పారు.