
భార్యను చంపిన కానిస్టేబుల్
♦ హైదరాబాద్‌లో ఘటన
♦ మృతురాలిది రొంపిచర్ల మండలం
బంజారాహిల్స్(హైదరాబాద్) : భార్యాభర్తల మధ్య విభేదాలు మహిళ ప్రాణాలు బలిగొన్నాయి. తనపైనే అధికారులకు ఫిర్యాదు చేస్తావా అంటూ ఓ పోలీస్ కానిస్టేబుల్ కట్టుకున్న భార్యను కడతేర్చాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం గురిపాడు గ్రామానికి చెందిన బి.విజయలక్ష్మి (25), యూసుఫ్‌గూడ మొదటి పటాలంలో కానిస్టేబుల్ నర్సిరెడ్డి దంపతులు యూసుఫ్‌గూడ పోలీస్‌లైన్స్‌లోని క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. గత నాలుగైదు రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
శుక్రవారం మధ్యాహ్నం జరిగిన గొడవలో నర్సిరెడ్డి తన భార్యను విచక్షణా రహితంగా కొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆమె మొదటి పటాలం కమాండెంట్‌కు ఫిర్యాదు చేసింది. ఆ నోటా ఈనోటా ఈ విషయం బెటాలియన్‌తో పాటు పోలీస్ క్వార్టర్స్‌లో తెలిసిపోయింది. శుక్రవారం ఉదయం డ్యూటీకి వెళ్లిన నర్సిరెడ్డిని సహచరులు భార్యను గొడ్డునుబాదినట్టు బాదుతావా అంటూ ప్రశ్నించారు. మహిళపై ఎలా చేయిచేసుకున్నావంటూ అడిగారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన నర్సిరెడ్డి మధ్యాహ్నం ఇంటికి వచ్చి తనపై అధికారులకు సహచరులకు ఫిర్యాదు చేస్తావా అంటూ మళ్లీ కొట్టాడు.
అక్కడే ఉన్న కర్రతో బలంగా కొట్టాడు. తలపట్టుకొని గోడకేసి కొట్టడంతో ఆమె తల పగిలి రక్తస్రావం జరిగి విలవిలలాడుతూ కిందపడిపోయింది. కొద్దిసేపట్లోనే శ్వాసవిడిచింది. చుట్టుపక్కల వారు ఈ అరుపులకు, కేకలకు పరిగెత్తుకొచ్చి చూడగా అప్పటికే విజయలక్ష్మి విగతజీవిగా కనిపించింది. వెంటనే ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. గత కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తనకు సరిగా అన్నం వండిపెట్టడం లేదని సరిగా చూడటం లేదని పోలీసుల విచారణలో నర్సిరెడ్డి వెల్లడించారు. ఈ విషయంలోనే కలహాలు తలెత్తాయని వివరించారు. భార్య హత్యకు కారణమైన కానిస్టేబుల్ నర్సిరెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరికి వరుణ్‌రెడ్డి (3), పూజితారెడ్డి(5) ఇద్దరు పిల్లలున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.