- రైతులకు కలెక్టర్ యువరాజ్ సూచన
విశాఖ రూరల్: ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం కింద అర్హులైన వారందరూ సంబంధిత బ్యాంకులను సంప్రదించాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ రైతులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు వారి రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, పట్టాదారు పాస్‌బుక్, టైటిల్ డీడ్ జెరాక్సు కాపీలను రుణం పొందిన బ్యాంకులకు అందజేయాలన్నారు.
అవి అందిన వెంటనే బ్యాంకర్లు లబ్ధిదారుల పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఈ నెల 25లోగా తమకు సమర్పించాలని ఆదేశిం చారు. ప్రభుత్వం మార్గదర్శకాలను నిర్దేశిస్తూ జీవో 174ను ఈ నెల 14న జారీ చేసిందని తెలిపారు. ఉత్తర్వులు వచ్చిన 14 రోజుల్లోగా రుణమాఫీకి అర్హులైన వారి జాబితాను రూపొందించాల్సి ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఇవీ అర్హతలు
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ నాటికి పంట రుణాలు, సాగు కోసం బంగారంపై రుణాలు పొందిన వారు రుణమాఫీకి అర్హులని తెలిపారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఉన్న రుణ బకాయిలు ఈ పథకం కింద మాఫీ చేస్తారని వెల్లడించారు. కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని వివిధ బ్యాంకుల్లో పొందిన రుణ మొత్తాన్ని కలుపుకొని రూ.1.50 లక్షలకు మించకుండా రుణమాఫీ ఉంటుందననారు.
అర్హులకు రుణమాఫీ వర్తింపచేయకపోతే అందుకు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, డుమా పీడీ శ్రీరాములు నాయుడు, ఆర్డీఓలు వెంకటమురళి, వసంతరాయుడు, సూర్యారావు, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.