కలెక్టరేట్, న్యూస్‌లైన్: వర్ష బాధితుల సహాయార్థం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి సుమారు 30 మంది రైతులు ఫోన్ చేసి పంట నష్టంపై సమాచారం అందించారు. వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నీటిపాలయ్యాయని, అధికారులు ఆదుకోవాలని రైతులు వేడుకున్నట్లు సిబ్బంది తెలిపారు.
వెంటనే సంబంధిత తహశీల్దార్లకు సమాచారమందించామని చెప్పారు. తిమ్మాపూర్, మంథని, కమాన్‌పూర్, ధర్మారం, రామడుగు, చిగురుమామిడి, గంగాధర, పెద్దపల్లి, కోహెడ, జమ్మికుంట, కొడిమ్యాల తదితర మండలాల నుంచి ఎక్కువ ఫోన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని నమోదు చేయడం, వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించేందుకు సూచనలు చేయడం, ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసే లక్ష్యంతో కలెక్టరేట్‌లో గురువారం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ప్రకటించినప్పటి నుంచి సదరు ఫోన్ మూగబోయింది. గురువారం అక్కడ పని చేస్తున్న సిబ్బంది కూడా ఈ విషయాన్ని గమనించలేదు. ఫోన్లు రావడం లేదని తీరిగ్గా కూర్చుండి వెళ్లిపోయారు.
శుక్రవారం ఉదయం తేరుకుని బీఎస్‌ఎన్‌ఎల్ వారికి సమాచారమిచ్చి మరమ్మతు చేయించారు. 24 గంటలు పనిచేసే ఈ కంట్రోల్ రూమ్‌లో మూడు షిప్టుల్లో ఇద్దరు చొప్పున రెవెన్యూ సిబ్బంది పనిచేస్తున్నారు. ఫోన్ చేసిన బాధితుల నుంచి పేరు, చిరునామా, సమస్య తెలుసుకుని నమోదు చేసుకుంటున్నారు. ఆ వివరాలను సంబంధిత తహశీల్దార్‌కు తెలియజేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టింపులేక ఉన్నతాధికారులకు చెప్పుకోవాలనుకున్న రైతులు తిరిగి అక్కడి అధికారులనే సంప్రదించాల్సిన పరిస్థితి వస్తోంది.
కంట్రోల్ రూమ్‌కు 30 కాల్స్
Published Sat, Oct 26 2013 3:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM
Advertisement
Advertisement