కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రకృతి వైపరీత్యాలతో కుదేలవుతున్న రైతులకు ప్రభుత్వ భరోసా గాలిలో దీపంలా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నీటిమీద రాతలే అయ్యాయి. బ్యాంకు రుణాలతోపాటు వడ్డీలకు తెచ్చిన అప్పులు పెట్టుబడుల రూపంలో వరదలో కొట్టుకుపోయాయి. గత మూడేళ్లుగా పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. సీజన్లవారీగా జరిగిన పంటనష్టంపై వ్యవసాయ, ఉ ద్యానశాఖల అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినప్పటికీ మూడేళ్లుగా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో పాత అప్పులు తీ ర్చలేక, కొత్త నష్టాలను భరించలేక దిక్కుతోచని స్థితిలో రైతన్నలు ఊపిరితీసుకుంటున్నారు. తా జాగా జిల్లావ్యాప్తంగా 1,77,180 ఎకరాల్లో వివి ధ పంటలు నీటిపాలై రైతులు కోలుకోలేని వి ధంగా దెబ్బతిన్నారు. పాత పరిహారమే ఇంతవరకు దిక్కులేదని, తాజా నష్టానికి పరిహారం వస్తుందనే ఆశలేదని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో 2011 మార్చి నుంచి మే 2013 వరకు 31,522 హెక్టార్లలో ఆహార పంటలను 82,664 మంది రైతులు నష్టపోయారు. వారిని ఆదుకునేందుకు రూ.19.97 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మం జూరు చేయాలని కోరుతూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. మూడేళ్లలో ఉద్యాన పంటలలో 26,300 హెక్టార్లలో మామిడితోటలు దెబ్బతినగా, 52,400 మంది రైతులు నష్టపోయారు. వీరికి రూ.34.72 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని అధికారులు నివేదిక లు సమర్పించినా ఇంతవరకు దిక్కులేదు. మ ధ్యలో గతేడాది నవంబర్‌లో నీలం తుఫాన్ కారణంగా 16 వేల హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతినగా, 34 వేల మంది రైతులకు నష్టం వాటిల్లింది.
వీరికి మాత్రం ప్రభుత్వం రూ.16 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేసి చేతులు దులుపుకుంది. మూడేళ్లలో జరిగిన పంట నష్టానికి సంబంధించి 1,35,064 మంది రైతులకు రూ. 54.62 కోట్ల మొత్తం సర్కారు విడుదల చేయా ల్సి ఉంది. దీంతోపాటు ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభమైన జూన్ నెలలో అధిక వర్షాలతో 7,724 హెక్టార్లలో వివిధ పంటలు నీటమునిగి ఇసుకమేటలు వేశాయి. 10 మండలాల్లో 2వేల మంది రైతులు నష్టపోగా, వారికి విత్తనాలు అందిస్తామని చెప్పి మొండిచేయి ఇచ్చింది. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు పంటలు నష్టపోతుండగా, అధికారులు సమన్వయలోపంతో మొక్కుబడి నివేదికలు తయారు చేస్తున్నారు. నష్టపోయిన పంటలో 50 శాతం దాటి పంట దెబ్బతింటేనే రైతులు పరిహారానికి అర్హులని నిబంధన పెట్టారు. దీంతో చాలామంది రైతులు పరిహారానికి నోచుకోవడం లేదు.
రెండు రోజుల్లో ప్రాథమిక అంచనా వేసిన తర్వాత తిరిగి నెలరోజుల పాటు రీసర్వే పేరిట పరిశీలించడంతో నష్టం అంచనా తప్పుతోంది. తాజాగా కురుస్తున్న వర్షాలతో పంటనష్టం సర్వే ఇంకా కొనసాగుతోంది. ప్రాథమిక అంచనాలు, ఆ తర్వాత రీసర్వేల అనంతరం ప్రభుత్వానికి నివేదికలు ఎప్పుడు అందుతాయో, పరిహారం ఎప్పుడు అందుతుందోనని రైతులు కుమిలిపోతున్నారు.
సర్కారు చేయిచ్చింది
Published Mon, Oct 28 2013 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
Advertisement
Advertisement