జిల్లా కలెక్టరేట్లో వరద సహాయక చర్యల్లో భాగంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బుధవారం కడపలో వెల్లడించారు. అందులో భాగంగా 08562- 246344 ఫోన్ నెంబర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అత్యవసర సేవల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1077ను కూడా ఏర్పాటు చేశామన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ రోజు ఉదయం ముద్దునూరు మండలం కలమలలోని కృష్ణా నగర్వంక పొంగిపొర్లుతుంది.
దాంతో ఆ నీటి ప్రవాహంలో పడి ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళ గల్లంతైంది. అలాగే చన్నమండం మండలంలో కూడా వరదలు పోటెత్తాయి. దాంతో మాండవ్య నదీలోని నీటి ప్రవాహ వేగం మరింత ఉధృతంగా మారింది. దాంతో రహదారులు ఎక్కడికక్కడ తెగిపోయాయి. జిల్లాలోని శ్రీనివాస రిజర్వాయర్లో వరద నీరు భారీగా చేరింది. దాంతో ఆ ప్రాజెక్టు సమీపంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ నేపథ్యంలో ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది.