జైపాల్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ: ఆర్టికల్ 3ని సవరించాలన్న డిమాండ్లపై కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 3ని సవరించాలన్న వారంతా అభినవ అంబేద్కర్లన్నారు. అంతా అభినవ అంబేద్కర్లయితే కష్టమవుతుంది కదా? అని కూడా అన్నారు. ఒక్క అంబేద్కర్‌తోనే మనకు ఇంత ప్రభావం ఉంది, అంతా అంబేద్కర్లయితే ఎలా పోతాం మనం? అని ప్రశ్నించారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుది పలాయనవాదం అన్నారు. ప్రజల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసమే ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. చంద్రబాబు జీవోఎం ముందుకు ఎందుకు రాలేదు? జీవోఎంకు చంద్రబాబు తన వాదన ఎందుకు వినిపించలేదు? అని ప్రశ్నించారు. 9 సంవత్సరాలు సీఎం, 10 సంవత్సరాలు ప్రతిపక్షనేతగా ఉన్నా చంద్రబాబుకు ఏం అర్ధం కావడంలేదని అడిగారు. సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్ పట్ల గుర్రుగా ఉన్నది నిజమేనన్నారు.
జీవోఎం కోసం తాము 11 అంశాలపై నివేదిక రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణలో విద్యుత్ సమస్య ఏర్పడుతుందని జైపాల్‌రెడ్డి చెప్పారు. తెలంగాణపై జాతీయ స్థాయిలో అపూర్వ ఏకాభిప్రాయం ఉందన్నారు. సీఎం పదవి కోసం పోటీలు పడుతున్నారనడం హాస్యాస్పదం అన్నారు. పోలవరం డిజైన్ మార్చడానికి తాము ఇంజనీర్లం కాదని చెప్పారు.