
అధికారులను విచారిస్తున్న డీఎస్సీ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి
కడప అగ్రికల్చర్ : సిద్దవటంలోని సహకార బ్యాంకు బ్రాంచీలో ఉంచిన బంగారు ఆభరణాలు మాయమై 24 రోజులు గడచినా ఇప్పటికి అతీగతీలేదు. ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఖాతాదారుల నుంచి వెళ్లువెత్తున్నాయి. ఎంతో నమ్మకంగా ఖాతాదారులు నగలను బ్యాంకు లాకర్లలో దాచుకుంటే కాపాలా కాయల్సిన అధికారులే స్వాహాకు పాల్పడితే ఎవరికి చెప్పు కోవాలని ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులోనే భద్రత లేకపోతే ఎలా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. రాజంపేట, అట్లూరు, అలిరెడ్డిపల్లె, ఖాజీపేట అగ్రహారం, సిద్దవటం సహకార సొసైటీ బ్యాంకుల్లో వరుసగా స్వాహా పర్వాలు చోటు చేసుకుంటుండడంతో సభ్యులు, ఖాతాదారులు హడలిపోతున్నారు. రాష్ట్ర సహకార శాఖామంత్రి ఆదినారాయణరెడ్డి సొంత జిల్లాలోనే ఇలా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఇంకెలా ఉంటుందో దీన్ని బట్టే అర్థమవుతోందంటున్నారు.
జరిగింది ఇలా..
గత నెల 7వ తేదీన బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ బదిలీపై రాజంపేట బ్రాంచీకి వెళ్లారు. అయితే 17న నగల లాకర్‌ను బ్యాంకు మేనేజర్ రవిచంద్రరాజు అనుమానం వచ్చి తీసి పరిశీలించారు. రికార్డు ప్రకారం 34 మంది ఖాతాదారుల నగలు ఉండాలి. అయితే అందులో నలుగురికి చెందిన నగల చిరు సంచుకులు కనిపించకపోవడంతో భయాందోళనకు గురైన మేనేజర్ వెంటనే అక్కడి బ్యాంకు అధికారులను సమావేశపరిచారు. నగల లాకర్ నుంచి మాయమైన విషయమై చర్చించారు. అధికారులు, సిబ్బంది తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు. జిల్లా కేంద్ర బ్యాంకు అధికారులు మేనేజర్‌ను, అసిస్టెంట్ మేనేజర్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఖాతాదారుల్లో నమ్మకం కలిగిలా పటిష్ట చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పబ్లిక్‌లో ఎదైనా సంఘటన జరిగినా, దొంగతనాలు జరిగిన సందర్భంలో హడావిడి చేసే పోలీసులు బ్యాంకులో నగలు స్వాహా అయి 24 రోజలు గడచినా ఎందుకు అరెస్టులు చేయలేదని సంఘంలోని సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
బాధితులు రైతులే..
సిద్దవటం సహకార బ్యాంకులో గత ఏడాది 34 మంది రైతులు తమ పంటల సాగు కోసం నగలను తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారు. ఇందులో అట్లూరు మండలం రెడ్డిపల్లెకు చెందిన పాటూరి విజయభాస్కరరెడ్డి 221 గ్రాముల బంగారును తాకట్టు పెట్టి రూ.3.28 లక్షలు, సిద్దవటం మండలం జ్యోతి గ్రామానికి చెందిన పిన్నపురెడ్డి సుబ్బమ్మ 28.5 గ్రాముల నగలు కుదువ పెట్టి రూ.40 వేలు, అదే మండలం పి.కొత్తపల్లెకు చెందిన రూపురెడ్డి ఎల్లారెడ్డి మొదటిసారి 62.5 గ్రాములకు రూ.95 వేలు, రెండోసారి 65.5 గ్రాముల నగలను తాకట్టుపెట్టి రూ.99 వేలు నగదు తీసుకున్నారు. ఇందులో ప్రతినెల పాటూరి విజయభాస్కరరెడ్డి మాత్రమే రూ.3250లు వడ్డీ చెల్లిస్తున్నారు. మిగతా వారు జూన్, జూలై నెలలో వడ్డీ చెల్లించి నగలు తీసుకోవడమో, రెన్యూవల్ చేయడమో చేస్తామని అనుకున్నారు. ఇంతలోనే అధికారులు ఆ నగలపై కన్నువేసి దోపిడీ చేశారు.
అరెస్టులు లేవు
జిల్లా ఉన్నతాధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. కేవలం విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారేగాని, అక్రమాలకు పాల్పడిన వారిని ఇంత వరకు అరెస్టులు చేయలేదని, ఒకవేళ నగలను స్వాధీనం చేసుకున్నారా అం టే అదీ లేదని పలువురు సభ్యులు ఆరోపిస్తున్నారు.
విచారణ జరుగుతోంది
నగలు మాయమైన విషయం బయటపడింది వాస్తమే. దీనిపై సమగ్ర విచారణ చేపట్టారు. 24 రోజులు పూర్తి అయింది. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. విచారణ పూర్తి కాగానే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయి. – వెంకటరత్నం, సీఈఓ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, కడప.
Comments
Please login to add a commentAdd a comment