పండుగకు పస్తులే..! | Coordinator Salary | Sakshi
Sakshi News home page

పండుగకు పస్తులే..!

Published Tue, Jan 14 2014 5:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

Coordinator Salary

 మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలోని 866 గ్రామపంచాయతీల్లో సాక్షర భారత్ కేంద్రాలు ఉన్నాయి. వీటి నిర్వహణకు 1732 గ్రామ కో ఆర్డినేటర్లు, 52 మంది మండల కో ఆర్డినేటర్లను నియమించారు. వేతనం నెలకు గ్రామ కో ఆర్డినేటర్‌కు రూ.2 వేలు, మండల కో ఆర్డినేటర్‌కు రూ.6 వేలు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆయా నిధుల నుంచి కో ఆర్డినేటర్ల వేతనాలు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో 14 నెలలుగా వేతనాలు అందక కో ఆర్డినేటర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కో ఆర్డినేటర్లకు 2012 అక్టోబర్ వరకు, గ్రామ కో ఆర్డినేటర్లకు 2012 నవంబర్ వరకు జీతాలు అందారుు. మండల కో ఆర్డినేటర్లకు 14 నెలలు, గ్రామ కోఆర్డినేటర్లకు 13 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగానైనా వేతనాలు విడుదల చేస్తారని ఆశించిన కో ఆర్డినేటర్లకు నిరాశే ఎదురైంది. దీంతో పండుగ వేళ పచ్చడి మెతుకులే గతి అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 జేబులోంచి ..
 ప్రతి నెలలో రెండుసార్లు మండల కేంద్రంలో నిర్వహించే శిక్షణకు గ్రామ కోఆర్డినేటర్లు వారి సొంత డబ్బులతో హాజరవుతున్నారు. సాక్షర భారత్ కేంద్రంలో రోజూ రెండు దినపత్రికలు, ఇతరత్ర పుస్తకాలనూ వారి డబ్బులతోనే కొంటున్నారు. వేతనం పెండింగ్‌లో ఉండడంతో కొందరు కో ఆర్డినేటర్లు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చి కేంద్రాల నిర్వహణ కొనసాగిస్తున్నారు. మరికొందరు ప్రభుత్వ వైఖరితో విసిగిపోరుు నిరక్షరాస్యులైన వయోజనులకు అక్షరాలు నేర్పేందుకు ఆసక్తి చూపడంలేదు. మండల కో ఆర్డినేటర్లు ప్రతీ సాక్షర భారత్ కేంద్రాన్ని తనిఖీ చేయాల్సి ఉన్నా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో పర్యవేక్షణపై శ్రద్ధ చూపడంలేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోందనే విమర్శలున్నారుు.
 
 ఎస్‌బీఐలోనే ఖాతా..
 గతంలో కో ఆర్డినేటర్లకు ఏ బ్యాంకులో ఖాతా ఉంటే వారికి అందులోనే వేతనం జమచేసేవా రు. ఈ క్రమంలో ప్రభుత్వం వేతనాల నిధు లు విడుదల చేయనుందని, కోఆర్డినేటర్లు ఎస్‌బీఐలో ఖాతా తెరవాలని అధికారులు గత నెలలో హుకుం జారీ చేశారు. దీంతో కో ఆర్డినేటర్లు ఎస్‌బీఐలో ఖాతా తెరిచే పనిలో నిమగ్నమయ్యూరు.  దీనికితోడు వేతనం పొందేం దుకు గ్రామపంచాయతీ నుంచి డ్యూటీ సర్టిఫికెట్ సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇన్నాళ్లు వేతనం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కో ఆర్డినేటర్లకు బ్యాంకు ఖాతా తెరిచేందుకు రూ.500 అదనపు భారంగా మారింది. కొన్నిచోట్ల డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వడానికి పంచాయతీ సిబ్బంది మామూళ్లు అడుగుతుండడంతో కో ఆర్డినేటర్ల బాధలు వర్ణనాతీతం. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని, పేపర్, ఇతరత్రా బిల్లులు చెల్లించాలని కో ఆర్డినేటర్లు కోరుతున్నారు.
 
 ఖర్చులు మేమే భరిస్తున్నం
 మాకు 2012 అక్టోబర్‌లో వేతనాలు అందించాక ఇప్పటి వర కు వేతనం చెల్లించలేదు. మా జేబులో నుంచే డబ్బులు ఖర్చుపెట్టి మండల కేంద్రంలో సమావేశాలు నిర్వహిస్తున్నం. సాక్షర భారత్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నం. వేతనాలు వస్తాయనే ఆశతో ప్రతినెలా అప్పులు చేస్తూ పోతున్నం. సంక్రాంతి పండుగకైనా వేతనాలు చెల్లిస్తారనుకుంటే ఉత్తదే అరుుంది. ఇలాగైతే పండుగ ఎలా జరుపుకోవాలి.
     - ఎం.ప్రకాశ్, మండల కో ఆర్డినేటర్, మంచిర్యాల
 
 అప్పులు చేస్తున్నం
 13 నెలలుగా మాకు వేతనాలు చెల్లించడంలేదు. ఇప్పటికే ప్రతి నెలా అప్పులు చేసి బతుకుతున్నం. ఇప్పుడేమో వేతనం కా వాలంటే ఎస్‌బీఐలో ఖాతా తె రవాలంటున్నారు. తప్పనిసరి కావడంతో రూ.500 అప్పు చేసి ఖాతా తెరిచా. వేతనాలు సంక్రాంతికి ముందే ఇస్తామన్నారు. డ్యూటీ సర్టిఫికెట్ కావాలంటే అది కూడా సమర్పించిన. కానీ వేతనం మాత్రం చెల్లించలేదు.
 - ఎం.అపర్ణ, గ్రామ కోఆర్డినేటర్, తీగల్‌పహాడ్
 
 డ్యూటీ సర్టిఫికెట్లు ఇస్తే జీతం
 14 నెలలుగా సాక్షర భారత్ కో ఆర్డినేటర్లకు వేతనాలు చెల్లించలేదు. ఇటీవలే ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. కో ఆర్డినేటర్లు వారు పనిచేసిన నెలలకు సంబంధించి ఆయా పంచాయతీల నుంచి డ్యూటీ సర్టిఫికెట్లు సమర్పించాలని 15 రోజుల క్రితం చెప్పాం. ఆయా సర్టిఫికెట్లు మాకు అందగానే వాటిని పరిశీలించి 12 నెలల వేతనాలు వారి ఖాతాల్లో జమచేస్తాం.
 - రామానుజరావు, వయోజన విద్యా డెప్యూటీ డెరైక్టర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement