
కరప పీహెచ్‌సీ వద్ద యాత్రికుల వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు
తూర్పుగోదావరి,కరప: కాశీ యాత్రకు వెళ్లిన కరప మండలంలోని భక్తులు ఆదివారం తిరిగి రావడంతో.. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాలతో అధికారులు, వైద్యులు వారికి కరోనా వైద్య పరీక్షలు చేశారు. స్థానిక పీహెచ్‌సీలో వారిని పరీక్షించి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపి ఇళ్లకు పంపేశారు. వారిలో ఎవరికీ కరోనా వైరస్ లక్షణాలు లేకపోవడంతో వైద్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు వారాల పాటు కాశీ యాత్ర నుంచి వారిని రోజూ పరీక్షించి వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామని మండల వైద్యాధికారి ఆర్.శ్రీనివాస్ నాయక్, వేళంగి పీహెచ్‌సీ డాక్టర్ జి.వీరయ్య తెలిపారు. కరప, పేపకాయలపాలెం, కోరుపల్లి తదితర గ్రామాల చెందిన వారు, ఇతర మండలాలకు చెందిన వారి బంధువులు 71 మంది ఈ నెల 13న కాశీ యాత్రకు బయలుదేరి వెళ్లారు. పూరి, గయ, ప్రయాగ, వారణాసి, త్రివేణి సంగమం తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించి ఆదివారం ఉదయం 6 గంటలకు విజయవాడ వచ్చారు. అక్కడి నుంచి 30 మంది ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రకారం రామేశ్వరం వెళ్లాల్సి ఉంది. కరోనా వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలకు, జనతా కర్ఫ్యూ నేపథ్యంలో, వారు విజయవాడ నుంచి రైలులో సామర్లకోట చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కన్నబాబు శనివారం నుంచి అధికారులను, వైద్యులను అప్రమత్తం చేస్తూ వచ్చారు.
కరప పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు
కాశీ యాత్రీకులకు వైద్య పరీక్షలు చేసేందుకు మండల వైద్యాధికారి ఆర్. శ్రీనివాస్ నాయక్, వేళంగి పీహెచ్‌సీ డాక్టర్ జి.వీరయ్య, మరో ఐదుగురు వైద్యులు, 50 మంది సిబ్బంది కరప పీహెచ్‌సీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాత్రికులు రాగానే వారిని కాళ్లు చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోమని, మాస్కులు ఇచ్చి పరీక్షించారు. రెండు వారాల పాటు ఇంటిలోనే ఉండాలని, ఆశా వర్కర్, ఏఎన్‌ఎంలు రోజూ వచ్చి పరీక్షిస్తారని వారికి వైద్యులు తెలిపారు. అవసరమైతే కాకినాడ ఆస్పత్రికి తీసుకెళతామని అన్నారు. కరప ఎస్సై డి.రామారావు, వైద్య సిబ్బంది యాత్రీకుల చిరునామాలు తీసుకుని, ఇంటికి వెళ్లాక తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వైఎస్సార్ సీపీ నాయకులు పాట్నీటి భీమేశ్వరరావు, గొర్రెల శ్రీనివాస్, దేవు వెంకన్న, సలాది బాబీ యాత్రికులు పీహెచ్‌సీకి రాగానే కూల్‌డ్రింకులు, పులిహోర ప్యాకెట్లను అందజేశారు. సామర్లకోట నుంచి కరప వచ్చి, వైద్య పరీక్షలు చేయించుకుని ఇంటికి వెళ్లేవరకు వారికి వైఎస్సార్ సీపీ నాయకులు, పోలీసులు సపర్యలు చేశారు.
ప్రత్యేక ఆర్టీసీ బస్సు ఏర్పాటు
కరప మండలం భక్తులు సామర్లకోట రైల్వే స్టేషన్‌లో దిగగానే, జనతా కర్ఫ్యూ కారణంగా స్వగ్రామాలకు వెళ్లలేక స్టేషన్‌లోనే ఉండిపోయారు. వైఎస్సార్ సీపీ కరప మండలం జెడ్పీటీసీ అభ్యర్థి యాళ్ల సుబ్బారావు ఈ విషయాన్ని మంత్రి కన్నబాబు దృష్టికి తీసుకెళ్లారు. యాత్రికులకు బస్సు ఏర్పాటు చేసి, వైద్య పరీక్షలు నిర్వహించి, ఇళ్లకు పంపే ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్ పేపకాయల భాస్కరరావు, ఆర్టీఓ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులను మంత్రి కన్నబాబు ఆదేశించారు. కాకినాడ డిపో మేనేజర్‌తో మాట్లాడి ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేశారు. ఈలోగా 16 మంది భక్తులు రెండు ఆటోల ద్వారా, 44 మంది ఆర్టీసీ బస్సులో కరప పీహెచ్‌సీకి చేరుకున్నారు. మిగిలిన 11 మంది సొంతూరు వైజాగ్, ఇతర గ్రామాలకు వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment