
తూర్పుగోదావరి: రాజోలు మండలం కడలి గ్రామంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి భయంతో ఓ కుటుంబం ఏడాదిన్నర కాలంగా ఇంటికే పరిమితమైంది. ఐదుగురు కుటుంబసభ్యులు ఒకే గదిలో ఉంటున్నారు. ఈ కుటుంబంలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. అవసరాల కోసం తండ్రి, కుమారుడు మాత్రమే బయటకు వచ్చేవారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలం విషయంలో వాలంటీర్ బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేయాలని అడిగారు.
అయితే, తాము బయటకు రాబోమని, తమకు ఇంటి స్థలం ఏమీ వద్దని తేల్చి చెప్పారు. దీంతో ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామ సర్పంచ్ చొరవతో రాజోలు పోలీసులు వారి ఇంటికి వెళ్లి వారిని బయటకు తీసుకు వచ్చారు. సరైన ఆహారంలేక బక్కచిక్కిన ముగ్గురు మహిళలను రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు.