బతుకు చిత్రం మారుతోంది! | Corona virus changed the life on those who are dependent on occupations | Sakshi
Sakshi News home page

బతుకు చిత్రం మారుతోంది!

Published Thu, Apr 23 2020 4:19 AM | Last Updated on Thu, Apr 23 2020 11:11 AM

Corona virus changed the life on those who are dependent on occupations - Sakshi

మాస్క్, గ్లౌజులు ధరించి ఇంటివద్దకే వెళ్లి క్షుర కర్మ చేస్తున్న నాయీ బ్రాహ్మణుడు

సాక్షి, అమరావతి:  ‘ఇల వృత్తులెన్ని ఉన్నా.. కుల వృత్తికి సాటిరావు గువ్వల చెన్నా’ అని నమ్మి.. వృత్తులపైనే ఆధారపడిన జీవిస్తున్న వారి బతుకు చిత్రాలను కరోనా వైరస్‌ మార్చేసింది. వృత్తిదారుల వెతలను వెనుకటి కాలానికి తీసుకెళ్లింది. దాదాపు 30 ఏళ్ల క్రితం నాయీ బ్రాహ్మణులు ప్రజల ఇళ్లకే వెళ్లి వృత్తి నిర్వహించేవారు. ప్రస్తుతం పూట గడుపుకోవటానికి పాత పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. 

► మూడు దశాబ్దాల క్రితం వరకు గ్రామీణ ప్రాంతాలు, చిన్నపాటి పట్టణాల్లో నాయీ బ్రాహ్మణులు పొది (కత్తెరలు, కత్తులు, దువ్వెన, చిన్న గిన్నె వంటివి) తీసుకుని ఇంటింటికీ తిరిగి కేశ సంస్కారం చేసేవారు.  
► అప్పట్లో పంటలు వచ్చే సమయంలో ఏడాదికి రెండుసార్లు బస్తాల లెక్కన ధాన్యం, కొంత నగదు, బియ్యం ఇచ్చేవారు. ఈ విధానాన్ని ‘వతను’ అనేవారు.  
► రానురాను ఫ్యాషన్‌ ప్రపంచంతో పోటీపడుతూ పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లోనూ అద్దాల క్యాబిన్లు, ఈజీ చైర్లు వంటి సౌకర్యాలతో సెలూన్లు అందుబాటులోకి వచ్చాయి. 
► కరోన దెబ్బతో సెలూన్లన్నీ మూతపడ్డాయి. దీంతో వాటిలో పనిచేసే వారు ఉపాధి కోల్పోయారు. పూట గడవని దయనీయ స్థితిలో వారంతా పాత పద్ధతిని అనుసరిస్తూ ఇంటింటికీ వెళ్లి క్షౌ ర వృత్తి చేస్తూ ఉపాధి పొందే ప్రయత్నం చేస్తున్నారు.  
► లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించే వేళ ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య మొహానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించి.. శానిటైజర్లు వినియోగిస్తూ కేశ సంస్కారం చేస్తున్నారు. 
► ఒకవేళ ఎవరైనా అజాగ్రత్తగా ఉంటే వినియోగదారులే వారిని అప్రమత్తం చేయడం.. వినియోగదారులు అలక్ష్యంగా ఉంటే వృత్తిదారులు చైతన్యంతో వ్యవహరిస్తున్నారు. 
► రాష్ట్రంలో సుమారు 5 లక్షల నాయీ బ్రాహ్మణ కుటుంబాలు కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నట్లు ఒక అంచనా. ప్రస్తుతం వారికి ఉపాధి దొరకడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న సాయంపైనే ఆధారపడి బతుకుల్ని నెట్టుకొస్తున్నారు. 

వృత్తిని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం
కరోనా కారణంగా వివాహాది శుభకార్యాలు నిలిచిపోయాయి. ఈ రోజుల్లోనే నాలుగు డబ్బులు కనిపించేవి. ఇప్పుడు పూట గడవని పరిస్థితుల్లో నాయీ బ్రాహ్మణులు పాత పద్ధతిలోనే ఇంటింటికీ వెళ్లి వృత్తిని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు.  
– పొన్నాడ సూర్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ నంద యువసేన 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement