ఆక్వా రైతుల్లో కరోనా కల్లోలం  | Corona Virus Effect On Aqua Exports | Sakshi
Sakshi News home page

ఆక్వా రైతుల్లో కరోనా కల్లోలం 

Published Sat, Mar 21 2020 11:24 AM | Last Updated on Sat, Mar 21 2020 11:24 AM

Corona Virus Effect On Aqua Exports - Sakshi

భీమవరం మండలంలో రొయ్యలు సాగవుతున్న చెరువు

భీమవరం: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో ఆక్వా రైతుల్లో కలవరం మొదలైంది. వైరస్‌ భయాలతో రొయ్యల ఎగుమతులు నిలిచిపోతాయని రైతులు ఒక్కసారిగా పట్టుబడులు చేపట్టడంతో ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. రొయ్యలు 100 కౌంట్‌ ధర కిలోకు రూ.60 పతనమైంది. గతంలో కిలో రూ.240 పలికే రొయ్య వంద కౌంట్‌ ధర ప్రస్తుతం రూ.180 పలుకుతోంది. ఇతర దేశాల్లో సైతం కరోనా వైరస్‌ వల్ల ఆయా ప్రభుత్వాలు అనేక ఆంక్షలు విధించడంతో రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు కరోనా వైరస్‌ను  నివారించేందుకు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల కూడా రొయ్యల అమ్మకాలపై ప్రభావం పడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాలుగా ధరల్లో కొద్దిగా తగ్గుదల కనిపిస్తున్న నేపథ్యంలో ఆరోగ్యంగా పెరుగుతున్న రొయ్యలను సైతం పెద్దమొత్తంలో రైతులు  పట్టుబడి చేసేస్తున్నారు. దీంతో ధరలు భారీగా పడిపోయాయి. పట్టుబడులు పెరగడంతో కూలీలు, ఐస్‌కు తీవ్ర గిరాకీ నెలకొంది.
(ఆ నలుగురూ ఎక్కడ..?)

నిలిచిన ఎగుమతులు:
చైనా, అమెరికా వంటి దేశాలకు రొయ్యల ఎగుమతులు నిలిచిపోతాయని, దీనివల్ల రొయ్యల ధరలు మరింతగా తగ్గే ప్రమాదం ఉందంటూ  భయపడి రైతులు పట్టుబడులు సాగిస్తున్నారు. జిల్లాలో  సుమారు 90 వేల ఎకరాల విస్తీర్ణంలో రొయ్యల సాగు చేస్తుండగా మరొక 1.10 లక్షల ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నారు. గత వారం 30 కౌంట్‌ రొయ్యలు కిలో సుమారు రూ.500 పైబడి ధరకు కొనుగోలు చేయగా ప్రస్తుతం రూ.460  పడిపోయింది.  అలాగే కిలో 100 కౌంట్‌ రొయ్యలు రూ. 240 నుంచి రూ.180కు తగ్గిపోయింది. 90 కౌంట్‌ రూ.190, 80 కౌంట్‌ రూ.200, 70 కౌంట్‌ రూ. 210, 60 కౌంట్‌ రూ.230, 50 కౌంట్‌ రూ.250, 40 కౌంట్‌ రూ.310 కొనుగోలు చేస్తున్నారు.
(కరీంనగర్‌లో ఇం‍డోనేషియన్లకు ఏం పని..?)

పెరిగిన  రొయ్యల పట్టుబడులు 
జిల్లాలో రొయ్యల సాగుచేస్తున్న రైతులు ఎక్కువగా వేసవి సీజన్‌లో మంచి దిగుబడులు వస్తాయని ఆశిస్తారు. ఫిబ్రవరి  నుంచి వాతావరణం అనుకూలంగా ఉండడం రొయ్యలకు పెద్దగా తెగుళ్లు సోకకపోవడం వంటి కారణంగా వల్ల మంచి దిగుబడులు సా«ధిస్తారు.  నాలుగు నెలల కాలంలో రొయ్యలు ఆరోగ్యవంతంగా పెరిగితే కిలోకు  30 కౌంట్‌ సాధించే అవకాశం ఉంది.  30, 40 కౌంట్‌ రొయ్యలకు అత్యధిక ధర లభిస్తుంటుంది. అయితే ఇటీవల అమెరికా, చైనా వంటి దేశాల్లో 50 కౌంట్‌ పైబడిన రొయ్యలను ఎక్కువగా కొనుగోలు చేయడంతో ఎగుమతిదారులు కూడా వాటిపట్ల మక్కువ చూపుతున్నారు.  ఇటువంటి తరుణంలో కరోనా వైరస్‌ కారణంగా రొయ్యల ధరలు మరింత తగ్గిపోతాయని రైతులు ఆందోళనకు గురై వారం రోజులుగా పెద్ద మొత్తంలో పట్టుబడులు సాగిస్తున్నారు. దీంతో రొయ్యల పట్టుబడి పట్టే కూలీలు, ఐస్‌కు డిమాండ్‌ పెరిగింది. రొయ్యల పట్టుబడి పట్టే కూలీలకు గతంలో  రూ. 600 ఇస్తే ప్రస్తుతం రూ. 800 పైబడి డిమాండ్‌ చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కూలీలకు రోజువారీ కూలీ సొమ్ములతోపాటు ఉదయం టీ, టిఫిన్స్, మధ్యాహ్న భోజనంతోపాటు కూల్‌ డ్రింక్స్‌ ఇతర సదుపాయాలు కలి్పంచాల్సి వస్తున్నదని చెబుతున్నారు. అలాగే ఒకేసారి రొయ్యల పట్టుబడులు పెరగడంతో ఐస్‌కు కూడా డిమాండ్‌ పెరిగిందని  ఐస్‌ ధరల్లో పెద్ద వ్యత్యాసం లేకున్నా అవసరం మేరకు ఐస్‌ కావాలంటే సమయం పడుతుందని రైతులు తెలిపారు.   కరోనా వైరస్‌ భయంతో ఎటువంటి వ్యాధులూ లేని ఆరోగ్యవంతమైన రొయ్యలను సైతం పట్టుబడులు చేస్తున్న కారణంగానే కూలీలకు, ఐస్‌కు డిమాండ్‌ పెరిగిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎగుమతి అవుతున్న రొయ్యలు  గతంలో ఇచ్చిన ఆర్డర్ల మేరకే  జరుగుతున్నాయి.  రొయ్యల ఎగుమతి అయ్యే దేశాల నుంచి రొయ్యల దిగుమతులు నిలిపివేయాలని ఎటువంటి ఆంక్షలూ లేవని ఎగుమతిదారులు స్పష్టం చేస్తున్నారు. అంతేగాకుండా  గతంలో  చైనాకు రొయ్యల ఎగుమతులు నిలిచిపోగా గత మూడు రోజులుగా తిరిగి ప్రారంభమయ్యాయని చెబుతున్నారు.  రొయ్యల ఎగుమతులపై ఎటువంటి ప్రభావం లేకున్నా కేవలం రైతుల్లో ఆందోళన కారణంగా పట్టుబడులు పెరగడం వల్లనే ధరల్లో మార్పు వచ్చిందని ఎగుమతిదారులు స్పష్టం చేస్తున్నారు.  

రొయ్యల ఎగుమతులు నిలిచిపోలేదు 
రొయ్యల ఎగుమతులు నిలిచిపోతున్నాయనే వదంతులను రైతులు నమ్మవద్దు. అనవసరంగా జరుగుతున్న ప్రచారంతో పట్టుబడులుచేసి రైతులు నష్టపోవద్దు.  చైనా దేశానికి కూడా రొయ్యల ఎగుమతులు అవుతున్నాయి.  రొయ్యలకు భవిష్యత్తులో మరింత డిమాండ్‌ ఏర్పడి ధరలు కూడా పెరిగే అవకాశం వుంది. రైతులు పరిస్థితులను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని కౌంట్‌ తక్కువ ఉన్న ఆరోగ్యవంతమైన రొయ్యలను పట్టుబడులు పట్టకుండా ఉంటే మేలు కలుగుతుంది. 
భీమాల శ్రీరామమూర్తి, ఏపీ సీఫుడ్స్‌ సప్లయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement