సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్–19)ను కట్టడి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట వ్యూహంతో ముందుకు వెళ్తోంది. వలంటీర్లు – గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను వినియోగించుకుని విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంలో ముందు వరుసలో నిలిచింది. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వారిని, వారి సంబంధికులను క్వారంటైన్, ఐసోలేషన్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పని తీరు పట్ల వివిధ రాష్ట్రాలు ప్రశంసిస్తుండటం గమనార్హం. మరోవైపు వైరస్ విస్తరించకుండా లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తోంది. రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలో ప్రత్యేక కోవిడ్–19 ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో క్వారంటైన్ సెంటర్లను అన్ని సదుపాయాలతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదే సమయంలో నిత్యావసర వస్తువులను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి గట్టి చర్యలు తీసుకుంది. రైతు బజార్ల సంఖ్యను పెంచడం, ధరలు పెరగకుండా నియంత్రించడం, పెద్ద ఎత్తున పారిశుద్ధ్య పనులు చేపట్టడం, అత్యవసర వ్యవస్థలు నిరంతరం పని చేసేలా చర్యలు తీసుకోవడం తెలిసిందే.
వలంటీర్ల వ్యవస్థ ద్వారా ముందే గుర్తింపు
► ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదిలోనే మేల్కొంది. మార్చి రెండవ వారంలో తొలి దశలో వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్ల ద్వారా విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించడానికి ఇంటింటి సర్వే చేసింది.
► ఫిబ్రవరి 10 నుంచి మార్చి 23 వరకు.. విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న 27,876 మందితో పాటు, వారిని తరచుగా కలిసిన వారు, వారి కుటుంబ సభ్యులు (ప్రైమరీ కాంటాక్ట్స్) సుమారు 80,896 మందికి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి హోం ఐసోలేషన్‌లో, క్వారంటైన్‌లో ఉంచింది.
► ఆ తర్వాత ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లను ప్రతి రోజూ వారి ఇళ్లకు పంపి, ఆరోగ్య పరిస్థితులను వాకబు చేసి, అవసరమైన వైద్య సేవలు వారి ఇళ్ల వద్దే ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యుల ద్వారా అందిస్తోంది. కరోనా లక్షణాలు కనిపించిన వారిని తక్షణమే ఆసుపత్రులకు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని ప్రత్యేక ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు.
► రెండో దశలో మార్చి 31 నుంచి రోజూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు.. పట్టణాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడానికి 2.62 లక్షల మంది వలంటీర్లు, 28 వేల మంది ఏఎన్‌ఎంలు (15 వేల మంది ఏఎన్‌ఎంలు, 13 వేల మంది గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ హెల్త్ అసిస్టెంట్లు), 40 వేల మంది ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు.
► ఇప్పటిదాకా 1.46 కోట్ల కుటుంబాలకు గాను 1.37 కోట్ల కుటుంబాలను సర్వే చేశారు. ఈ సర్వేలో 5,517 మందికి జలుబు, దగ్గు, జ్వరం ఉన్నట్లు గుర్తించారు. ఈ 5,517 మందిని వారి ఇళ్ల వద్దే ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు రోజూ పరిశీలించి చికిత్స చేస్తున్నారు.
కరోనాపై అవగాహన కల్పించాలన్న సీఎం సూచన మేరకు మార్చి 11నే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఇచ్చిన ఉత్తర్వు
ఢిల్లీ ఎఫెక్ట్‌తో పెరిగిన కేసులు.. కట్టుదిట్టంగా కట్టడి చర్యలు
► రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక చర్యలతో రాష్ట్రంలో కరోనా మహమ్మారికి ఇక ముకుతాడు పడుతుందనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా ఢిల్లీ సదస్సుతో పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.
► ఢిల్లీలో గత నెల 15 నుంచి మూడు రోజులపాటు నిర్వహించిన సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా మన రాష్ట్రం నుంచి సుమారు 1,085 మంది హాజరయ్యారు. ఆ సమావేశంలో ఇండోనేషియా, సౌదీ అరేబియా వంటి దేశాలకు చెందిన పలువురు హాజరయ్యారు. వారి నుంచి కరోనా వైరస్ ఢిల్లీ సమావేశంలో పాల్గొన్న వారికి సోకింది.
► ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన.. ఢిల్లీ సమావేశానికి హాజరైన రాష్ట్రానికి చెందిన వారిని గుర్తించింది. వారితోపాటు, వారి సంబంధీకులకు మార్చి 31 నుంచి వరుసగా పరీక్షలు నిర్వహించింది. అందులో 280 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వారందరికీ చికిత్స అందిస్తూ.. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది.
► ఒకానొక దశలో గత సోమవారం (మార్చి 30వ తేది) వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 23 మాత్రమే. సోమవారం సాయంత్రం వరకు నమోదైన మొత్తం 303 కేసుల్లో ఢిల్లీకి సంబంధించిన 280 మందిని తీసేస్తే మిగిలే కేసులు కూడా 23 మాత్రమే. ప్రస్తుతం వీరిలో ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. అంటే కేవలం 17 పాజిటివ్ కేసులు మాత్రమే ఉండేవి. ఈ లెక్కన ఢిల్లీ సదస్సు వ్యవహారం లేకపోయి ఉండింటే ప్రభుత్వ పటిష్ట చర్యలతో రాష్ట్రంలో కరోనా వైరస్‌కు ఈ పాటికి చెక్ పడి ఉండేదని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు.
► ‘కరోనా కాటుకు మందులేదు. కులం, మతం, ధనిక, పేద అన్న తేడా లేదు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో మనందరి ప్రత్యర్థి కరోనా మహమ్మారే. కుల, మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా నిలబడి గెలిచి తీరాల్సిన సమయం ఇది. అందరం ఐక్యంగా భారతీయులుగా పోరాటం చేద్దాం’ అని సీఎం వైఎస్ జగన్ నిత్యం సమీక్షలు చేస్తూ అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూ వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నారు.
పటిష్ట వ్యూహంతో కరోనాపై పోరు
Published Tue, Apr 7 2020 2:44 AM | Last Updated on Tue, Apr 7 2020 7:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment