తోటి ఉద్యోగులతో అన్నెం జ్యోతి
బండిఆత్మకూరు/కోవెలకుంట్ల/మహానంది: కర్నూలు జిల్లాకు చెందిన అన్నెం జ్యోతి చైనాలోని వుహాన్‌లో చిక్కుకుపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో పాటు వచ్చే నెలలో ఆమె వివాహం ఉండడంతో వారి ఆందోళన రెట్టింపవుతోంది. కోవెలకుంట్ల మండలం బిజినవేములకు చెందిన జ్యోతి తల్లి ప్రమీల, తండ్రి అన్నెం మహేశ్వరరెడ్డి. తండ్రి నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో మృతిచెందారు. బీటెక్ పూర్తిచేసిన జ్యోతి టీసీఎల్‌లో ఉద్యోగం సాధించి శిక్షణ నిమిత్తం గత ఆగస్టు 23న 58 మంది కంపెనీ ఉద్యోగులతో కలిసి వుహాన్‌కు వెళ్లారు. అక్కడ ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభించడంతో.. అక్కడి భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జ్యోతి, ఆమె సహచరులు వుహాన్‌లోని విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. జ్యోతితో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో యువకుడికి జ్వరం కొంత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఈ కారణంగా వారిని ఇండియాకు పంపేందుకు నిరాకరించారు.
తాను పడుతున్న అవస్థలను జ్యోతి వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఇప్పటికే జ్యోతి కుటుంబ సభ్యులు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డిలను కలిసి సమస్యను వివరించారు. వారు ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆదివారం ప్రమీలకు ఫోన్ చేసి.. త్వరలోనే దేశానికి వస్తుందని ధైర్యం చెప్పారు. జ్యోతికి మహానంది మండలం తమడపల్లెకు చెందిన అమర్‌నాథరెడ్డితో ఇటీవల వివాహ నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెలలో వివాహం. జ్యోతిని త్వరగా దేశానికి రప్పించాలని ప్రమీల, అమర్‌నాథరెడ్డి మీడియా ద్వారా అధికారులకు విజ్ఞప్తి చేశారు. (చదవండి: కరోనా డేంజర్ బెల్స్)
Comments
Please login to add a commentAdd a comment