సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పేదల జీవితాలకు పలువురు దాతలు ఆసరాగా నిలుస్తున్నారు. అయితే వారు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా కరోనా ప్రభావిత ప్రాంతాలకు వెళితే కొత్త సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఇన్ని రోజులు పడిన కష్టం వృథా చేసేలా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో అనుమతి లేకుండా దాతలు ఆహారం, నిత్యావసరాల పంపిణీకి వెళ్లవద్దని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావిత రెడ్‌జోన్లలో 37 మండలాలు, ఆరెంజ్ జోన్లలో 44 మండలాలు (మొత్తం 81) ఉన్నాయి. ఈ ప్రాంతాలకు వెళ్లాలంటే దాతలు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఆంక్షలు విధించారు.
ఆంక్షలు ఎందుకంటే...
► రోజువారీ కూలీపై ఆధారపడి జీవిస్తున్న పేదలు, అనాథలు లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి వారికి ప్రభుత్వంతోపాటు పలువురు అండగా నిలిచి ఆకలి తీరుస్తున్నారు. అయితే రాను రాను పలు రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు, సంఘాలు, వ్యక్తులు బృందాలుగా ఏర్పడి దానాలు చేయడం ప్రారంభించారు. దీంతో ఎక్కువ మంది గుమిగూడుతున్నారు. మాస్కులు, గ్లౌజులు ధరించడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే మరింత ప్రమాదం.
► మరికొందరైతే మరో అడుగు ముందుకేసి తమ దాతృత్వాన్ని పది మందికి తెలియాలనే తపనతో ఫొటోలు, వీడియోలు, సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారు.
► ఈ నేపథ్యంలో సాయానికి పోయి కరోనా వైరస్ వ్యాప్తికి దోహదం చేసినవారు కాకూడదనే ఉద్దేశంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాతలు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఆంక్షలు విధించారు. ఏ ప్రాంతంలోనైనా ఆహారం, నిత్యావసర సరుకులను ఉచితంగా అందించేవారు ముందుగా స్థానిక పోలీసుల అనుమతి తీసుకోవాలనే నిబంధన పెట్టారు.
► దాతలు ఎవరు, వారి ఆరోగ్యపరమైన రికార్డు ఏమిటి, ఆహారం ఎక్కడ తయారు చేయిస్తున్నారు, ఎంత మంది వెళ్లి ఎక్కడ ఆహారం, నిత్యావసర సరుకులు పంచుతారు? తదితర వివరాలు తెలుసుకున్న తర్వాతే పోలీసులు వారికి తగిన జాగ్రత్తలు చెప్పి అనుమతిస్తారు.
దాతలు అనుమతి తీసుకోవాలి
Published Mon, Apr 13 2020 3:44 AM | Last Updated on Mon, Apr 13 2020 4:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment