విజయవాడ ఐఎంజీ స్టేడియంలోని రైతుబజార్‌లో తనిఖీ చేస్తున్న లీగల్ మెట్రాలజీ శాఖ కంట్రోలర్ కాంతారావు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో వ్యాపారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని లీగల్ మెట్రాలజీ శాఖ కంట్రోలర్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యం.కాంతారావు హెచ్చరించారు. లాక్‌డౌన్ వల్ల ఏర్పడిన పరిస్థితులను కొందరు వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుని ఇష్టారీతిగ ధరలు పెంచడం, తూకాల్లోనూ మోసం చేయడం తమ దృష్టికి వచ్చిందన్నారు. గత మూడు వారాల్లో 13,067 చోట్ల తనిఖీలు నిర్వహించి 585 కేసులు నమోదు చేశామన్నారు. విజయవాడలో ఉన్న లీగల్ మెట్రాలజీ శాఖ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తూకాల్లో మోసం, ధరల పెంపు గుర్తిస్తే నేరుగా టోల్ ఫ్రీ నెంబర్ 18004254202కు ఫోన్ చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా వ్యాపారులకు, వినియోగదారులకు ఆయన కొన్ని సూచనలు చేశారు.
వ్యాపారులకు సూచనలు....
► నిత్యావసరాలను కలెక్టర్లు నిర్ణయించిన ధరలకు, ప్యాకేజి వస్తువులను ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలి.
► ధరల పట్టికను దుకాణంలో ప్రదర్శించాలి.
► తూనిక యంత్రాలకు సంబంధించి ప్రామాణికతను పాటించాలి.
► పెట్రోల్ పంపుల డీలర్లు ధర, కొలతల విషయంలో ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి.
వినియోగదారులకు సూచనలు...
► నిత్యావసర వస్తువుల విషయంలో ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు.
► కొనుగోలు సమయంలో ధర, తూకం విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
► లాక్‌డౌన్ వల్ల పేదలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తోంది. డీలర్లు తూకాల్లో తేడా ఇస్తున్నట్లు గుర్తిస్తే ఫిర్యాదు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment