సాక్షి, అనంతపురం: కనిపించని కరోనా భూతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఎందరో వైరస్ బారిన పడ్డారు. జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కోవిడ్ ఎవరికి సోకిందో.. ఎవరికి సోకుతుందో తెలియని పరిస్థితి. అందరిలోనూ ఒకటే ఆందోళన. మహమ్మారి ఫోబియాలా మారింది. ప్రభుత్వం కోవిడ్ నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేసింది. సకాలంలో కోవిడ్ ఫలితాల సమాచారం అనుమానితులు, బాధితులకు అందేలా జిల్లా అధికారులను ఆదేశించింది. అందుకు తగ్గట్టు ఫలితాలు వెళ్లేలా జిల్లా అధికారులు ‘అనంత’లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. గత నెల 16న కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో కలిసి కలెక్టర్ గంధం చంద్రుడు ఎస్‌ఎంఎస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో ధైర్యాన్ని నింపే మెసేజ్, నెగిటివ్ వచ్చిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ పరీక్షలు చేసుకున్న వారికి సంక్షిప్త సమాచారం వెళ్తోంది. (కిరాణ షాపులే కేంద్రంగా కరోనా విజృంభణ)
మెసేజ్ ఇలా..
కోవిడ్ అని నిర్ధారణ అయిన వెంటనే బాధితుల సెల్ నంబర్‌కు కలెక్టర్ పేరు మీద మెసేజ్ వెళ్తుంది. కోవిడ్ పాజిటివ్ అయితే.. ‘ప్రియమైన వ్యక్తి పేరు, క్షమించండి. మీ ఐడీ కింద కోవిడ్ 19 పరీక్ష మీకు పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం మీకు మెరుగైన వైద్య సేవలందింస్తుంది. మీరు కోవిడ్‌తో పోరాడి ఆరోగ్యవంతంగా డిశ్చార్జ్ అవుతారని’ సందేశం వస్తుంది. నెగిటివ్ అయితే..‘ డియర్.. (పూర్తి పేరు) నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఐడీ నంబర్ 2461 కోవిడ్ –19 పరీక్ష నెగిటివ్ వచ్చిందని’ సందేశం వస్తుంది. (కరోనా : మొన్న తండ్రి.. నిన్న కొడుకు)
5,826 మందికి సమాచారం:
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్‌ఎంఎస్ పద్ధతిలో ఫలితాలు తెలుపక మునుపు రెండు, మూడ్రోజుల సమయం పట్టేది. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. గత నెల 15 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 5,826 మంది ఎస్‌ఎంఎస్‌ల రూపంలో సమాచారం వెళ్లింది. అందులో 5,547 మందికి నెగిటివ్, 59 మందికి పాజిటివ్ అని తేలింది.
సకాలంలో సమాచారం
ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు మరింత వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. అదే స్థాయిలో ఫలితాలు సకాలంలో బాధితులకు తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని గత నెలలో శ్రీకారం చుట్టాం. పాజిటివ్, నెగిటివ్ వచ్చిన వెంటనే వారికి సమాచారం వెళ్తుంది. – గంధం చంద్రుడు, కలెక్టర్
జిల్లాలో మరో మూడు కేసులు
అనంతపురం: జిల్లాలో మరో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హిందూపురం, తాడిపత్రి, శెట్టూరులో కేసులు నమోదు కాగా, కోవిడ్ బాధితుల సంఖ్య 70కి చేరింది. ఈ విషయమై కలెక్టర్ గంధం చంద్రుడు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తాడిపత్రి రూరల్ పీఎస్‌లో విధులు నిర్వర్తించే ఓ కానిస్టేబుల్(32)కు కోవిడ్ సోకింది. అదేవిధంగా శెట్టూరుకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి, గుత్తిలోని 18 ఏళ్ల యువతి కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 41 యాక్టివ్ కేసులు ఉండగా.. 24 మంది ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. 5గురిని కోవిడ్ కబళించింది. 70 పాజిటివ్ కేసుల్లో 45 మంది పురుషులు, 24 మంది మహిళలు, ఒక బాలుడు ఉన్నారు.
హిందూపురం మహిళకు కోవిడ్
హిందూపురానికి చెందిన ఓ మహిళ(30) ఇటీవల కర్ణాటక నుంచి జిల్లాకు వచ్చింది. కర్ణాటక కోవిడ్ బాధితుల జాబితాలో ఆమె పేరు ఉంది. ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో ఆమెను కలుపుకుని 71 పాజిటివ్ కేసులను అధికారులు చూపించారు. అనంతరం సదరు మహిళ పేరు కర్ణాటకలో ఉండడంతో ఇక్కడ తొలగించారు.
కోవిడ్ ఆస్పత్రుల్లో 34 మంది
జిల్లాలోని వివిధ కోవిడ్ ఆస్పత్రుల్లో 36 మంది అడ్మిషన్‌లో ఉన్నారు. కిమ్స్ సవీరాలో 9, బత్తలపల్లి ఆర్డీటీలో 25 మంది అడ్మిషన్‌లో ఉండగా.. శనివారం 5గురు అడ్మిట్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment