
సాక్షి, విజయవాడ: జిల్లాకు వంద నమూనాలు సేకరించి కరోనా హాట్‌స్పాట్‌లను గుర్తిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి అన్నారు. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఆంక్షల అమలు కఠినతరం చేస్తామని వెల్లడించారు. ర్యాపిడ్ టెస్టులతో వైరస్ ఎంత వ్యాపించిందో తెలుస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 304 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో 260 మందికిపైగా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారేనని అన్నారు. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వారి సమాచారం సేకరించామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరి శాంపిల్స్ సేకరించామని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
పరీక్ష సామర్థ్యం పెరిగింది..
ఫిబ్రవరి 5న కేవలం 90 మందికి మాత్రమే పరీక్షలు చేసే సామర్థ్యం ఉండేది. దానిని ఇవాళ వెయ్యి మందికి పరీక్షలు నిర్వహించే స్థాయికి పెంచాం. 3 లక్షల ర్యాపిడ్ టెస్టు కిట్లను ఆర్డర్ చేశాం. 240 మిషన్ల ద్వారా ర్యాపిడ్ టెస్టులు చేసే అవకాశం ఉంది. రోజుకు 3వేల నుంచి 4వేల టెస్టులు చేసే ఛాన్స్ ఉంది. రాష్ట్ర స్థాయిలో 4 కోవిడ్ ఆస్పత్రులు ఉన్నాయి. జిల్లాకొక కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 12 వేల పర్సన్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్‌లు అందుబాటులో ఉన్నాయి. అవసరాలకు అనుగుణంగా మరిన్ని ఆర్డర్ చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment