సాక్షి, విజయవాడ: ప్రాణాంతక కోవిడ్-19 ను ఎదుర్కొనేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఏపీ వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి అన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 14 రోజులపాటు కచ్చితంగా ఇంట్లోనే ఉండాలని సూచించారు. వారు 14 రోజుల స్వీయ గృహ నిర్బంధం పాటించేలా చూసేందుకు.. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కొందరు ప్రభుత్వ సూచనలు పాటించకుండా బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే కచ్చితంగా అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు.
(చదవండి: హోం అబ్జర్వేషన్!)
విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని జవహర్ రెడ్డి తెలిపారు. కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్‌తో సమీక్ష చేశామని చెప్పారు. మాస్కులు, సానిటైజర్లను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వాటిని ఎమ్మార్పీ ధరలకు అమ్మినా చర్యలు తీసుకుంటామని, కొన్న ధర కంటే 10 శాతానికి మించి అధికంగా తీసుకోకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రతీ మెడికల్ షాప్‌లోనూ ధరలను డిస్ ప్లే చెయ్యాలని ఆయన ఆదేశించారు. కరోనా నిర్ధారణ ల్యాబ్‌లను తిరుపతి, విజయవాడలో ఏర్పాటు చేశామని, రేపు కాకినాడలో మరో ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
(చదవండి: కరోనా లక్షణాలు దాస్తే 6నెలల జైలు శిక్ష)
Comments
Please login to add a commentAdd a comment