సాక్షి, గుంటూరు: కరోనా కల్లోలంతో అనేక అవస్థలకు గురవుతున్న నేపథ్యంలో కొందరు మానవత్వం మరచిపోతున్నారు. జాలి, దయ, కరుణ చూపాల్సిన తరుణంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లినందున అద్దె ఇంట్లోకి రావద్దని హుకుం జారీచేస్తున్నారు. తక్షణం ఇంటిని ఖాళీచేసి వెళ్లాల్సిందేనని యజమానురాలు తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారు. కుమారుడు పోలీసు ఉన్నతాధికారి కావడంతో ఆయన తన పలుకుబడిని ఉపయోగిస్తూ తల్లికి వత్తాసు పలుకుతున్నారనే తీవ్రారోపణలు వస్తున్నాయి. ఆ అధికారి సిఫార్సుతో తెనాలిలోని అధికారులు ఫోన్ ద్వారా ఒత్తిళ్లు తెస్తున్నారు. (పులి కోసం ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు)
తెనాలి చినరావూరులో తల్లి, 23 ఏళ్ల కూతురు నివాసం ఉంటున్నారు. అనారోగ్యంతో మార్చి 24న కూతురు ఆసుపత్రిలో మృతిచెందారు. షాక్‌కు గురైన తల్లికి 26న పక్షవాతం సోకింది. తెనాలి, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తరువాత మరుసటి రోజు అంబులెన్స్‌లో తీసుకెళ్లగా యజమానురాలు ఇంట్లోకి రానీయలేదు. అంబులెన్స్‌లో తీసుకొచ్చారని, కరోనా ఉండవచ్చని అభ్యంతరం చెపుతూ పరీక్ష చేయించుకుని రావాలని ఒత్తిడి తెచ్చారు. నెగటివ్ రిపోర్టును చూపినా అంగీకరించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో స్వస్థలమైన భట్టిప్రోలు మండలంలోని పెదలంకకు బంధువులు ఆమెను తీసుకెళ్లారు.
ఇల్లు ఖాళీ చేయాలంటూ ఫోన్‌లో ఒత్తిళ్లు ...
వెంటనే వచ్చి ఇల్లు ఖాళీ చేయాలంటూ ఫోన్ ద్వారా నిత్యం ఒత్తిళ్లు తెస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితురాలి పెద్ద కూతురు హైదరాబాద్‌లో ఉంటున్నారు. లాక్‌డౌన్ వల్ల తన చెల్లెలి చివరిచూపునకు కూడా తాము నోచుకోలేకపోయామని ‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు. తన ఐదు నెలల బిడ్డతో పాటు అమ్మమ్మ కూడా ఉంటుందని, లాక్‌డౌన్ ముగిశాక తెనాలికి వచ్చి ఇల్లు ఖాళీచేస్తామని ఎంత చెపుతున్నా అంగీకరించడంలేదని వాపోయారు. ఈ పరిస్థితుల్లో తాము ఎవరికి చెప్పుకోవాలో కూడా అంతుబట్టడంలేదని ఆవేదన చెందారు. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు. ఉన్నతాధికారులు న్యాయం చేయాలని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment