సాక్షి, నెల్లూరు: ఒకప్పుడు విద్యాసంస్థలకు నెల్లూరు పెట్టింది పేరు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారు ఇక్కడకు వచ్చి చదువుకునేవారు. కాలక్రమంలో ఆ ప్రాభవం తగ్గినా పాతవాసనతో జిల్లాలో కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు కళాశాలలను నిర్వహిస్తున్నాయి. గతంలో ఇవీ ఒక వెలుగు వెలిగాయి. క్రమేణా వీటిలోని విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రచార ఆర్భాటం తప్ప ఆశించిన స్థాయిలో విద్యాప్రమాణాలు లేకపోవడంతో నాణ్యమైన విద్య అందిస్తున్న చిన్నచిన్న విద్యాసంస్థలవైపే విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. ఇది కార్పొరేట్ విద్యాసంస్థలపై తీవ్రప్రభావం చూపుతోంది.
విద్యార్థుల సంఖ్య సగానికి సగం పడిపోయింది. రెండేళ్లుగా విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గుతోంది. నెల్లూరు శివారులోని ఓ కళాశాలలో గత విద్యాసంవత్సరంలో సీనియర్ ఇంటర్ విద్యార్థులు 700 మంది, జూనియర్ ఇంటర్ విద్యార్థులు 600 మంది ఉన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో సీనియర్ ఇంటర్‌కు వచ్చిన 600 మంది విద్యార్థుల్లో కొందరు వివిధ కారణాలు చూపుతూ టీసీలు తీసుకుని ఇతర కళాశాలల్లో చేరిపోయారు. ఈ ఏడాది జూనియర్ ఇంటర్‌లో కేవలం 190 మంది చేరడం అక్కడి పరిస్థితికి నిదర్శనం. బిజినెస్ పడిపోతుండటంతో ధనార్జనే ధ్యేయంగా కళాశాలలు నిర్వహిస్తున్న సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఫీజు డిస్కౌంట్ అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ ఇప్పటి నుంచే విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మభ్యపెట్టే పనిలో పడ్డాయి.
డబ్బే ప్రధానం
విద్యాసంవత్సరం ప్రారంభంలో కార్పొరేట్ విద్యాసంస్థల ఏజెంట్లు వివిధ ఆఫర్ల పేరుతో విద్యార్థుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వారి మాటలు వినిన తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయా కళాశాలల్లో చేరుస్తారు. అక్కడి నుంచి అసలు సమస్య మొదలవుతుంది. ప్రతి అంశాన్ని డబ్బుతో ముడిపెడతారు.
దుస్తులను విద్యార్థులే ఉతుక్కున్నా ధోబీ చార్జీలంటూ ఏడాదికి రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు వసూలు చేస్తారు. పరీక్ష ఫీజులను ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కంటే రెండు, మూడు రెట్లు అదనంగా గుంజుతారు. ప్రాక్టికల్స్‌లో మార్కుల కోసమంటూ మరో బాదుడు. పరీక్షల సమయంలో పరీక్ష కేంద్రాలకు వెళ్లే వాహనాల ఖర్చు అదనం. వీటితో పాటు పుస్తకాలు, మెటీరియల్స్ అంటూ తరచూ ఫీజుల మోత మోగిస్తారు. విద్యార్థి ఏదైనా సందర్భంలో ఇంటికి వెళ్లి వస్తే ఫీజు కడితేకానీ లోనికి అనుమతించరు.
తల్లిదండ్రులు, బంధువులు ఎవరైనా వెళ్లి ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను బతిమిలాడినా దురుసుగా వ్యవహరిస్తారు. ఇంత వసూలు చేస్తున్నా విద్యార్థులకు నాణ్యమైన తిండి పెడుతున్నారా అంటే అదీ లేదు. ఆ రోజు మార్కెట్‌లో ఏ కూరగాయలు చౌకగా దొరికితే వాటిని వండి వడ్డిస్తారు. ఒక్కోసారి భోజనంలో పురుగులు సైతం దర్శనమిస్తుంటాయి. క్యాంటీన్‌లో ఏదేని ఆహారం కొనుగోలు చేయాలన్నా ప్రతిదీ డబుల్ రేటే. ఇక వసతులు కూడా అంతంతమాత్రమే. ఐదుగురు సరిపోయే గదిలో 8 నుంచి 10 మంది విద్యార్థులను ఇరికిస్తారు. వేలాది రూపాయల ఫీజు చెల్లిస్తున్నా అనుభవం లేని అధ్యాపకులతోనే క్లాసులు నెట్టుకొస్తున్నారు.
అనుభవజ్ఞులకు భారీగా జీతాలు చెల్లించాల్సి ఉండటంతో వ్యాపార దక్ఫథంతో ఆలోచిస్తున్న యాజమాన్యాలు తక్కువ జీతాలకు వచ్చేవారితోనే మమ అనిపిస్తున్నారు. వీటన్నింటిని కప్పిపుచ్చుకునేందుకు వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు స్టడీఅవర్స్ పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఎక్కువ శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను స్థానికంగా నాణ్యమైన విద్య అందించే కళాశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మార్కెట్‌లోకి ఏజెంట్లు
విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు ఓ కార్పొరేట్ విద్యాసంస్థ యాజమాన్యం ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తోంది. గతంలో జూనియర్ ఇంటర్‌కు (రెసిడెన్షియల్) రూ.45 వేలు వరకు వసూలు చేస్తున్న ఆ సంస్థ ఇప్పుడు రిజర్వ్ చేసుకుంటే రూ.30 వేలేనంటూ ప్రచారం మొదలుపెట్టింది. ప్రస్తుతం తమ కళాశాలలో ఉంటున్న విద్యార్థులకు ఆ ఆఫర్లను వివరిస్తున్నారు. మీకు తెలిసిన వారిని చేర్పించమంటూ ఒత్తిడితెస్తున్నారు. మరోవైపు ఆయా విద్యాసంస్థల కమీషన్ ఏజెంట్లు ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చేశారు. ఒక విద్యార్థిని చేర్పిస్తే రూ. 2 వేలు నుంచి రూ.3 వేలు కమీషన్ ఇస్తామంటూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల చుట్టూ తిరుగుతున్నారు. విద్యాప్రమాణాలు, ఇతర సదుపాయాలను మెరుగుపరచడంలో శ్రద్ధపెట్టడం విస్మరించిన కళాశాలలు ఆఫర్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘కార్పొరేట్’ ఢమాల్
Published Sat, Nov 9 2013 3:57 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM
Advertisement
Advertisement